Site icon HashtagU Telugu

Electric Flex Fuel Vehicle : ఆ టెక్నాలజీతో ప్రపంచంలోనే తొలికారు.. 29న ఇండియాలో రిలీజ్.. విశేషాలివీ..

Electric Flex Fuel Vehicle

Electric Flex Fuel Vehicle

Electric Flex Fuel Vehicle : ఆగస్టు 29న (మంగళవారం) మనదేశ ఆటోమొబైల్ రంగం మరో కొత్త మలుపు తీసుకోనుంది.  ఆ రోజున నూటికి నూరు శాతం ఇథనాల్‌తో నడిచే టొయోటా ఇన్నోవా ఎంపీవీ వెర్షన్‌ వాహనాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మార్కెట్ లోకి రిలీజ్ చేయబోతున్నారు. అధునాతన ‘‘ఎలక్ట్రిక్  ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ’’తో తయారు చేసిన ఇంజన్ ఈ కారులో ఉంది.  హైడ్రోజన్ ద్వారా విద్యుత్‌ ను ఉత్పత్తి చేసుకొని వాడుకునే కెపాసిటీ ఈ ఇంజన్  సొంతం. 100 శాతం ఇథనాల్‌తో నడవడం దీని స్పెషాలిటీ. ప్రపంచంలోనే మొట్టమొదటి BS-VI (స్టేజ్-II) ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనం ఇదేనని టయోటా కంపెనీ అంటోంది. టొయోటా ఇన్నోవా ఎంపీవీ వాహనం చూడటానికి టయోటా ఇన్నోవా హైక్రాస్‌ మోడల్ ను తలపించేలా ఉంటుందని అంటున్నారు. ఇథనాల్ అనేది చాలా తక్కువ ధరలో లభిస్తుంది. దీని లీటరు ధర రూ.60 కంటే తక్కువే. 2025 నాటికి పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ ను మిక్స్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రానున్న రోజుల్లో పూర్తిగా ఇథనాల్‌తో నడిచే బైక్‌లు కూడా మార్కెట్ లోకి రానున్నాయి.

Also read : Massive Blast : ఏడుగురు సజీవ దహనం.. భారీ పేలుడుతో చెల్లాచెదురుగా శరీర భాగాలు

ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ అంటే ఏమిటి ?

ఫ్లెక్స్ అంటే ఫ్లెక్సిబులిటీ. ఏ ఇంధనంతోనైనా నడిచేలా వాహన ఇంజన్ ను  ఫ్లెక్సిబుల్ గా మార్చడమే ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ మహిమ. ఇందులో పెట్రోల్ వాడొచ్చు. ఇథనాల్ ఫ్యూయల్ వాడొచ్చు. ఏది వాడాలనేది వాహన యజమాని ఇష్టం. ఈ తరహా ఇంజన్లు కలిగిన వాహనాలు పెట్రోల్ లో  83% వరకు ఇథనాల్ ను మిక్స్ చేసినా నడుస్తాయి.  ప్రస్తుతానికి ఈ తరహా వాహనాలు అమెరికా, బ్రెజిల్, కెనడాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2018 నాటికే అమెరికాలోని రోడ్లపైకి దాదాపు 2 కోట్లకుపైగా ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ వాహనాలు వచ్చేశాయి. కానీ ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనం తొలిసారిగా ఆగస్టు 29న మన దేశంలో రిలీజ్ అవుతోంది. అన్ని రకాల ఇంధనాల ద్వారా నడవడంతో పాటు హైడ్రోజన్ తో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం దీనికి ఉంది.  

Also read : Retirement Age: పదవీ విరమణ వయస్సు పెంపుపై కేంద్ర ప్రభుత్వం పరిశీలన..!

ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లకు పెట్రోల్ కార్లకు తేడా ఏమిటి?

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలలోని అన్ని భాగాలు .. ఇతర వాహనాల భాగాలలాగే ఉంటాయి. అయితే వీటిలో ప్రత్యేకంగా ఇంటర్నల్ కంబ్యూషన్ ఇంజన్ (internal combustion engine) ఉంటుంది. దీనివల్లే పెట్రోల్ లో 83% ఇథనాల్ ను కలిపినా వాహనం నడుస్తుంది. ఇతర కార్లకు భిన్నంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లలో ఫ్యూయల్ పంప్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌లలో మార్పులు ఉంటాయి. ఇథనాల్ మోతాదు పెరగడం వల్ల ఇంజన్ లో ఆక్సిజన్ మోతాదు పెరుగుతుంది. దీనిపై మానిటరింగ్, కంట్రోలింగ్ చేసేందుకు ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లలో ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్‌ ఉంటుంది. ఇది ఇంధనాల మిక్స్ పర్సంటేజీ, ఇంధనాల జ్వలన సమయం, కాలుష్య ఉద్గారాల రిలీజ్ తో ముడిపడిన వ్యవస్థలను నిత్యం పర్యవేక్షిస్తుంది. వాటిని నియంత్రణలో ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఫలితంగా ఇంజిన్ భద్రత మరింత మెరుగవుతుంది. ఏవైనా సమస్యలుంటే గుర్తించి, ట్రబుల్ షూట్ చేసే పనిని కూడా ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్‌ నిర్వర్తిస్తుంది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు ప్రయోజనాలు ఏమిటి ?

పెట్రోల్ కార్ల యజమానులు తమ వాహనాల్లో కేవలం పెట్రోలే వాడాలి. కానీ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల (Electric Flex Fuel Vehicle) యజమానులు పెట్రోలు వాడొచ్చు..ఇథనాల్ ఫ్యూయల్ కూడా వాడొచ్చు. మార్కెట్ లో ధరలను బట్టి, లభ్యతను బట్టి దేన్ని వాడాలనేది డిసైడ్ చేసుకునే ఫ్రీడమ్, సౌలభ్యం కేవలం ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనదారులకు మాత్రమే ఉంటుంది. ఈ వాహనాలు అంత స్పెషల్. విదేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేయడానికి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తున్న భారత్ వంటి దేశాలకు ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు ఒక వరం లాంటివి. మన దేశంలో ఇథనాల్ ఇంధనం ఉత్పత్తి చేయడానికి అపార అవకాశాలు ఉన్నాయి. ఇథనాల్ తయారీకి ముడిసరుకుగా వాడే మొక్కజొన్న, చెరుకు పంటల సాగు మనదేశంలో పెద్దఎత్తున జరుగుతుంటుంది.