టయోటా తన ప్రసిద్ధ MPV ఇన్నోవాను పూర్తిగా కొత్త అవతారంలో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ తన కొత్త ఇన్నోవా జెనిక్స్ కు సంబంధించి కొన్ని టీజర్‌లను ఇటీవల విడుదల చేసింది. ఈ వీడియోలో కారుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని వెల్లడించింది. ఇండియన్ మార్కెట్లో దీనిని ఇన్నోవా హైక్రాస్ గా పరిచయం చేయవచ్చు. కంపెనీ మంగళవారం మరో టీజర్‌ను విడుదల చేసింది. ఇది కంపెనీ కొత్త ఇన్నోవాను పనోరమిక్ సన్‌రూఫ్‌తో విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. నివేదిక ప్రకారం.. ఈ కారు మొదట నవంబర్ 21 న ఇండోనేషియా మార్కెట్లోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత నవంబర్ 25న భారతీయ మార్కెట్లో విడుదల చేయనున్నారు.
టయోటా ఇండోనేషియా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఈ టీజర్ విడుదల చేశారు. ఈ వీడియోలో కారులో పెద్ద పరిమాణ పనోరమిక్ సన్‌రూఫ్ కనిపిస్తుంది. టయోటా ఇన్నోవాలో ఇంత పెద్ద సన్‌రూఫ్ ఇవ్వడం ఇదే తొలిసారి. ఇంతకుముందు కంపెనీ ఇన్నోవా క్రిస్టాలో స్టాండర్డ్ సైజ్ సన్‌రూఫ్‌ను ఇచ్చింది. అయితే మొదటి తరం మోడల్‌లో సన్‌రూఫ్ అస్సలు లేదు. ఈ కారు విడుదల తేదీ సమీపిస్తున్నందున దీనికి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ షేర్ చేస్తోంది.
కంపెనీ పనోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు మూడవ వరుస ప్రయాణీకుల కోసం ప్రత్యేక AC వెంట్ కూడా ఈ కారులో అందిస్తోంది. దీని వలన కారు లోపలి క్యాబిన్ మండే వేడిలో కూడా మెరుగైన కూలింగ్‌ను అందిస్తుంది. కారు లోపలి భాగాన్ని మరింత లగ్జరీగా మార్చేందుకు యాంబియంట్ లైటింగ్ కూడా ఇవ్వనున్నారు. కొత్త ఇన్నోవా హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో కూడా అందించబడుతుందని కంపెనీ ధృవీకరించింది.
కంపెనీ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 2.0 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను పరిచయం చేస్తుందని భావిస్తున్నారు. టొయోటా దాని బయట రూపాన్ని కూడా పంచుకుంది. కొంచెం స్పోర్టి లుక్‌ను ఇస్తూ SUV అనుభూతిని ఇస్తుంది. కొత్త ఇన్నోవా హైక్రాస్‌లో అనేక ప్రధాన మార్పులు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుత ఇన్నోవా క్రిస్టా నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దీనికి V-ఆకారంలో విస్తృత బానెట్ ఇవ్వబడింది. దిగువ భాగంలో క్రోమ్ యాక్సెంట్‌లు, హై మౌంటెడ్ హెడ్‌ల్యాంప్‌లు వంటి ఫీచర్లు దాని రూపాన్ని మరింత ఆకర్షణీయంగా చేయనున్నాయి. ముందు భాగంలో ఫోగ్‌ల్యాంప్‌లు, సింగిల్ యూనిట్ ఎయిర్‌డ్యామ్ ఇవ్వబడ్డాయి. మీడియా నివేదికల ప్రకారం.. కొత్త ఇన్నోవా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది.
ఇటీవల కొత్త ఇన్నోవా హైక్రాస్ ఇంటీరియర్ కొన్ని చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. దీని ప్రకారం ఈ కారు బహుళ-లేయర్డ్ డాష్‌బోర్డ్, రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంటుందని చెప్పవచు. ఈ కొత్త మార్పులు కంపెనీ తాజా తరం Voxy MPV నుండి ప్రేరణ పొంది ఉండవచ్చు. ఇది కాకుండా పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, టచ్-సెన్సిటివ్ HVAC కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఇతర ఫీచర్లతో కూడా రావచ్చని భావిస్తున్నారు.
నవంబర్ 25న దీనిని భారత మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చు. రాబోయే ఆటో ఎక్స్‌పో 2023లో కంపెనీ దాని ధరను ప్రకటించే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. కొత్త టొయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌పివి ప్రారంభ ధర దాదాపు రూ. 23.75 లక్షలు ఉండవచ్చని అంచనా. ఇన్నోవా క్రిస్టా ప్రస్తుత మోడల్‌తో పాటు విక్రయించే అవకాశం కూడా ఉంది.