నెమ్మదిగా వర్షాలు మొదలవుతున్నాయి. దీంతో వాహనదారులు ఈ వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ద్విచక్ర వాహన వినియోగదారులు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇతర కాలాలతో పోల్చుకుంటే వానాకాలంలో ద్విచక్ర వాహన వినియోగదారులు చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు సురక్షితంగా ఉండాలి అన్నా వాహనం సక్రమంగా పని చేయాలి అన్నా కూడా జాగ్రత్తలు తప్పనిసరి. కొన్ని కొన్ని సార్లు వర్షాకాలంలో రోడ్లపై వాహనాలు పట్టుతప్పి ఊహించని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఎక్కడపడితే అక్కడ వాహనాలు ఆగిపోతూ ఉంటాయి.
మరి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలి అంటే వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాహనం రోడ్డుపై సక్రమంగా ప్రయాణించాలంటే దానికి తగినంత పట్టు చాలా అవసరం. ఒకవేళ మీ వాహనం టైర్లు అరిగిపోయి ఉంటే వెంటనే ముందుగానే వాటిని చెక్ చేసుకుని మార్చుకోవడం మంచిది. ఎందుకంటే అరిగిపోయిన టైర్ల వల్ల వర్షాకాలంలో రోడ్డపై జారిపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే గుంతలలో బండి దిగితే టైర్ కు రాళ్లు గుచ్చుకుని పంక్చర్ అయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయి. అయితే వర్షాకాలంలో బ్రేక్ల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టిఅలాంటప్పుడు బ్రేక్ నొక్కిన వెంటనే ముందు వెనుకటేలు రెండు ఒకేసారి ఆగేలా చూసుకోవాలి.
వర్షంలో ఎక్కువగా తిరిగితే చైన్ లోని లూబ్రికేషన్ పోతుంది. దానివల్ల తుప్పు పట్టడంతో పాటు పనితీరు కూడా మందగిస్తుంది. మోటారు సైకిల్ బ్యాటరీ పూర్తిగా చార్జి అయ్యేలా చూసుకోవాలి. వర్షం పడినప్పుడు బండిలోని విద్యుత్ భాగాలపై ప్రతికూల ప్రభావం కలుగుతుంది. మలుపులు తిరిగినప్పుడు సిగ్నల్ బల్బులు ఉపయోగించడం చాలా అవసరం. కాబట్టి బల్బులు, ఇతర ఇండికేటర్లు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలి. పాడైపోయిన బల్బులను వెంటనే మార్చుకోవాలి. బండి నిర్వహణ సక్రమంగా ఉన్నప్పటికీ మీరు ప్రయాణించే విధానం కూడా ప్రమాదాల నివారణకు సాధ్యపడుతుంది.
ముఖ్యంగా తడి పరిస్థితులలో పరిమిత వేగంతోనే వెళ్లాలి. అధిక వేగంతో వెళితే రోడ్లపై టైర్లు జారిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఎవరైనా సడెన్ గా అడ్డవస్తే బ్రేక్ వేసినప్పుడు బండి బోల్తా పడే అవకాశం కూడా ఉంది. బాగా స్పీడ్ గా వెళ్తున్నప్పుడు సడన్గా బ్రేక్ వేస్తే టైర్లు జారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మలుపులు తిరుగుతున్నప్పుడు, రోడ్డుపై బురద ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం వర్షాకాలంలో ఇతర వాహనాలకు కాస్త దూరం పాటించడం మంచిది.