Safran : తెలంగాణ‌కు మ‌రో భారీ ప‌రిశ్ర‌మ‌… వెయ్యి కోట్ల పెట్టుబ‌డితో..!

తెలంగాణ‌కు మ‌రో భారీ ప‌రిశ్ర‌మ రానుంది.

  • Written By:
  • Updated On - July 7, 2022 / 09:35 AM IST

తెలంగాణ‌కు మ‌రో భారీ ప‌రిశ్ర‌మ రానుంది. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్లు, రాకెట్ ఇంజన్‌లతో పాటు వివిధ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ సంబంధిత పరికరాలు, వాటి విడిభాగాల రూపకల్పన, అభివృద్ధి, తయారీ చేసే ఫ్రెంచ్ బహుళజాతి సంస్థ సఫ్రాన్ గ్రూప్ హైదరాబాద్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌చ‌యించింది. దాదాపు రూ. 1,185 కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌నుంది. ఇటీవ‌ల కాలంలో బ‌హుళ‌జాతి కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆస‌క్తి చూపుతున్నాయి. తాజాగా విమానయాన రంగ ఉత్పత్తులను తయారు చేసే ఫ్రాన్స్ కు చెందిన దిగ్గజ సంస్థ శాఫ్రాన్(SAFRAN)కూడా తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. ఏరోస్పేస్, రక్షణ కార్యకలాపాలకు కేంద్రంగా హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

ఈ కేంద్రం ఏర్పాటుతో సుమారు వెయ్యి మందికి ఉపాధి దొరుకుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. భారత్ తో పాటు విదేశీ వాణిజ్య విమానయాన సంస్థల విమానాల్లో వాడే ఇంజిన్లను హైదరాబాద్ లోనే చేస్తారని.. మరోవైపు ఈ భారీ పెట్టుబడితో హైదరాబాద్ కు తిరుగులేదన్న సంగతి మరోసారి రుజువైందని కేటీఆర్ సంతోషం వ్య‌క్తం చేశారు. సఫ్రాన్ గ్రూప్ 36 మిలియన్ యూరోల (సుమారు రూ. 293 కోట్లు) పెట్టుబడితో అధునాతన ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌ల కోసం విడిభాగాలు, భాగాలను తయారు చేయడానికి ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి హైదరాబాద్‌ను ఎంచుకుంది. హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరుతోంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని ఏరోస్పేస్, డిఫెన్స్ క్లస్టర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే ఈ విషయంలో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని తెలుస్తోంది.