Tata Sierra: భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ఐకానిక్ వాహనం టాటా సియెర్రా (Tata Sierra) దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశీయ మార్కెట్లోకి గ్రాండ్‌గా తిరిగి వస్తోంది. దీని అధికారిక ఆవిష్కరణకు ముందు టాటా మోటార్స్ శనివారం ముంబైలో ఈ లెజెండరీ SUV మొదటి లుక్‌ను ఆవిష్కరించింది.
టాటా మోటార్స్ ఎండీ, సీఈఓ అయిన శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. ఈ పునరాగమనాన్ని కేవలం కొత్త మోడల్ విడుదలగా కాకుండా ఒక చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. “మేము ఆవిష్కరిస్తున్నది కేవలం ఒక SUV కాదు. ఒక లెజెండ్‌ను. 90లలో తన బాక్సీ ఆకృతి, విశాలమైన విండోలతో ఇది భారతీయులను పెద్ద కలలు కనడానికి ప్రేరేపించింది. నేడు కొత్త తరం కోసం పునఃరూపకల్పన చేయబడిన సియెర్రా.. ఆధునిక నైపుణ్యంతో నేటి టాటా నిబద్ధతను తెలియజేస్తోంది. ఇది కేవలం జ్ఞాపకం కాదు, ఒక ఉద్యమంగా తిరిగి వస్తోంది” అని ఆయన అన్నారు.
Also Read: Akhanda 2: ‘అఖండ 2’ సెన్సేషన్.. భారీ ధరకు నార్త్ ఇండియా హక్కులు!
ఎలక్ట్రిక్ నుండి ICE వరకు డిజైన్ పరిణామం
సియెర్రా క్లాసిక్ డిజైన్‌ను ఆధునిక హంగులతో మేళవించారు. తొలుత 2020లో కాన్సెప్ట్ రూపంలో ఎలక్ట్రిక్ వెర్షన్ (EV) ను ప్రదర్శించిన టాటా.. 2023 ఆటో ఎక్స్‌పో నాటికి దానిని ఉత్పత్తికి మరింత దగ్గరగా తీసుకువచ్చింది. తాజాగా ఆటో ఎక్స్‌పో 2025లో సియెర్రా ICE (పెట్రోల్/డీజిల్) కాన్సెప్ట్ వెర్షన్‌ను ప్రదర్శించారు. పాత సియెర్రా ట్రేడ్‌మార్క్ అయిన దీర్ఘచతురస్రాకారపు వెనుక విండోను తిరిగి సృష్టించడానికి ప్రయత్నించారు. అయితే ఇప్పుడు సులభమైన యాక్సెస్ కోసం ఐదు డోర్ల లేఅవుట్ ను జతచేయడం జరిగింది.
ఆటోమొబైల్ చరిత్ర సృష్టికర్త
1991లో దేశంలో ప్రవేశపెట్టబడిన సియెర్రా భారతదేశంలో రూపకల్పన చేయబడి ఉత్పత్తి చేయబడిన మొట్టమొదటి SUVగా చరిత్ర సృష్టించింది. ఇది ఐచ్ఛికంగా 4×4 డ్రైవ్‌ట్రైన్ సామర్థ్యంతో వచ్చి తన కాలానికి ముందే ఆధునికతను చాటింది. ఇంజిన్ పరంగా 1997లో 68hp శక్తినిచ్చే డీజిల్ ఇంజిన్‌కు బదులుగా 87hp శక్తినిచ్చే టర్బోఛార్జ్డ్ వెర్షన్ ప్రవేశపెట్టబడింది.
జీఎస్‌టీ కోతతో టాటా విక్రయాల్లో జోష్
సియెర్రా పునరాగమన వార్తలతో పాటు మార్కెట్‌లో టాటా మోటార్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు కారణంగా కంపెనీ విక్రయాలలో గణనీయమైన వృద్ధి కనిపించింది. అక్టోబర్‌లో వాణిజ్య వాహనాల విక్రయాలలో టాటా 10 శాతం పెరుగుదలతో 37,530 యూనిట్లను నమోదు చేసింది. సెప్టెంబర్ 2025లో టాటా 40,594 యూనిట్లు నమోదు చేసి అమ్మకాలలో మహీంద్రా, హ్యుందాయ్‌లను అధిగమించడం పరిశ్రమలో ఒక ముఖ్యమైన మార్పుగా గుర్తించారు.
