Suzuki : భారత్ లో సుజుకీ భారీగా పెట్టుబడులు..రూ. 10వేలకోట్లకు పైనే..!!

జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారుదారీ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్...భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - March 21, 2022 / 01:34 PM IST

జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారుదారీ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్…భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇ-వెహికల్స్ , వాటికి సంబంధించిన బ్యాటరీల తయారీకి 2026 నాటికి రూ. 10,445 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గుజరాత్ సర్కార్ తో అవగాహన ఒప్పందం కూడా కుదిరనట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. జపాన్ ప్రధాని పుమియో కిషిద, భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో శనివారం ఢిల్లీలో జరిగిన ఇండియా-జపాన్ ఎకానమిక్ ఫోరం లో ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్లుగా పేర్కొంది.

భారత లక్ష్య సాధనకు తన వంతుగా తోడ్పాటు అందిస్తానని సుజుకీ డైరెక్టర్ అధ్యక్షుడు తొషిహిరో సుజుకీ తెలిపారు. ఈ క్రమంలో చిన్నకార్లతో కార్బనరహిత లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తామని చెప్పారు. బ్యాటరీ ఆధారిత విద్యుత్తు వాహనాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు తమ అనుబంధ సంస్థ సుజుకీ మోటార్ గుజరాత్ ప్రైవేట్ లిమిటెడ్ 7,300కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. ఇక మరో 3,100కోట్లు 2025నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కేటాయిస్తామని తెలిపారు.

ఇక ప్రస్తుతం హరియాణా, గుజరాత్ లో ఉన్న సంప్రదాయ వాహన తయారీ కేంద్రాలకు ప్రతి సంవత్సరం 22లక్షల వాహనాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని తొషిహిరో చెప్పారు. వీటికి అదనంగా మరో 7.5లక్షల వాహనాల తయారీ సామర్థ్యం కూడా ఉన్నట్లు వెల్లడించారు. కాగా మరో అనుబంధ సంస్థ అయిన మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ వాహన రీసైక్లింగ్ కు 45కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.

అటు భారత్ లో రానున్న ఐదు సంవత్సరాల్లో ట్రిలియన్ యెన్ ల రూ. 3.20లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు జపాన్ ప్రధాని ప్రకటించారు. రక్షణ, ఇంధన రంగంలో సహకారాన్ని పెంపొందించనున్నట్లు వెల్లడించారు. జపాన్ ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఉన్నతస్ధాయి ప్రతినిధి భారత్ లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. భారత్, జపాన్ 14వ వార్షిక శిఖరాగ్ర సమవేశంలో ప్రధానులు ఇద్దరూ పలు అంశాలపై చర్చించారు.