Shunya Air Taxi : ఎయిర్ ట్యాక్సీలు మన దేశంలోనూ అందుబాటులోకి రానున్నాయి. తొలుత బెంగళూరులో.. తదుపరిగా ముంబై, ఢిల్లీ, పుణె నగరాల్లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభిస్తామని బెంగళూరుకు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ ‘సర్లా ఏవియేషన్’ వెల్లడించింది. ఆయా నగరాల పరిధిలో ప్రజల అత్యవసర వైద్య సేవల కోసం ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. తమ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీకి ‘శూన్య’ అని పేరు పెట్టినట్లు తెలిపింది. తొలి విడతగా 2028 నాటికి బెంగళూరులో ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభిస్తామని పేర్కొంది. ఆ తర్వాతే మిగతా నగరాలకు సేవలను విస్తరించడంపై ఫోకస్ పెడతామని స్పష్టం చేసింది. ప్రీమియం వాహన ట్యాక్సీ సర్వీసులు వసూలు చేసే ఛార్జీల రేంజులోనే తమ ఎయిర్ ట్యాక్సీ ఛార్జీలు కూడా ఉంటాయని తెలిపింది.
Also Read :EPFO New Feature : పీఎఫ్ ఖాతా ఉందా ? సరికొత్త ఫీచర్‌తో మీకు మరింత స్వేచ్ఛ
గంటకు 250 కి.మీ వేగంతో ప్రయాణం
జనవరి 17 నుంచి 22 వరకు న్యూఢిల్లీ వేదికగా జరిగిన ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో’లో శూన్య ఎయిర్ ట్యాక్సీని(Shunya Air Taxi) తొలిసారిగా ‘సర్లా ఏవియేషన్’ ప్రదర్శించింది. ఎక్స్‌పో సందర్భంగా కంపెనీ సీఈఓ అడ్రియన్ ష్మిత్ కీలక వివరాలను వెల్లడించారు. ‘‘శూన్య ఎయిర్ ట్యాక్సీ గంటకు 250 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. 20 నుంచి 30 కి.మీ స్వల్ప దూరంలో రాకపోకలు సాగించేందుకు వీలుగా దీన్ని రూపొందించాం. ఈ ట్యాక్సీ గరిష్ఠంగా 680 కేజీల బరువును మోయగలదు. దానిలో గరిష్ఠంగా ఆరుగురు ప్రయాణించొచ్చు’’ అని ఆయన తెలిపారు.
Also Read :JioCoin : జియో కాయిన్.. ఎందుకు ? ఏమిటి ? ఎలా ?
ఫండింగ్ ఇచ్చిన ప్రముఖులు..
2023 అక్టోబరులో ఏర్పాటైన సర్లా ఏవియేషన్ కంపెనీకి ఫండింగ్ ఇచ్చిన ప్రముఖుల్లో ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఉన్నారు. యాక్సెల్ అనే కంపెనీ కూడా పెట్టుబడి పెట్టింది. ఇప్పటిదాకా ఈ కంపెనీకి రూ.86 కోట్ల ఫండింగ్ వచ్చింది.