GST Reduction: భారతదేశంలో ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఉండే పండుగ సీజన్ ఆటోమొబైల్ పరిశ్రమకు చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో గణేష్ చతుర్థి, ఓనం, నవరాత్రి, దసరా, దీపావళి, ధనతేరస్ వంటి పండుగల వల్ల కార్లు, టూ-వీలర్ల అమ్మకాలు భారీగా పెరుగుతాయి. మొత్తం వార్షిక అమ్మకాల్లో దాదాపు 30-40% ఈ పండుగ సీజన్‌లోనే జరుగుతాయి. అందుకే కంపెనీలు ఈ సమయంలో కొత్త ఆఫర్లు, మోడళ్లను విడుదల చేస్తాయి.
ఈ ఏడాది పండుగ సీజన్ మరింత కీలకం కానుంది. ఎందుకంటే ప్రభుత్వం చిన్న కార్లపై జీఎస్టీని 28% నుంచి 18%కి (GST Reduction) తగ్గించాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే కార్ల ధరలు గణనీయంగా తగ్గుతాయి. అయితే ఏ కార్లపై ఎంత మేరకు పన్ను తగ్గుతుందో ప్రభుత్వం ఇంకా స్పష్టంగా చెప్పలేదు. ఈ అనిశ్చితి వల్ల కొనుగోలుదారులు గందరగోళంలో పడ్డారు.
కొనుగోలుదారుల గందరగోళం, డీలర్ల ఆందోళన
జీఎస్టీ తగ్గింపుపై జరుగుతున్న చర్చలు కొనుగోలుదారులను అయోమయానికి గురి చేస్తున్నాయని చాలామంది డీలర్లు చెబుతున్నారు. ఢిల్లీ-NCRలోని ఒక డీలర్ ప్రకారం.. ఆగస్టు మొదటి రెండు వారాల్లో అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు చాలామంది కొనుగోలుదారులు బుకింగ్‌లు చేయడానికి బదులు జీఎస్టీ తగ్గింపు గురించి ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఇప్పుడే కారు కొంటే దీపావళికి పన్నులు తగ్గితే తాము నష్టపోతామని భావించి, కారు కొనుగోలును వాయిదా వేసుకుంటున్నారు.
మరోవైపు డీలర్లకు కూడా సమస్యలు పెరుగుతున్నాయి. ఇప్పటికే వారి వద్ద ఉన్న స్టాక్‌పై పాత పన్నులు వర్తిస్తాయి. ఒకవేళ జీఎస్టీ తగ్గింపు అమలులోకి వస్తే కొత్తగా అమ్మే కార్ల ధరలు తక్కువగా ఉంటాయి. దీంతో పాత స్టాక్‌ను విక్రయించడం కష్టమవుతుంది. ఇది వారి వర్కింగ్ క్యాపిటల్‌పై, వడ్డీ ఖర్చులపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే చాలా డీలర్లు ఎక్కువ డిమాండ్ ఉన్న మోడళ్లను మాత్రమే పరిమిత సంఖ్యలో స్టాక్ పెట్టుకుంటున్నారు.
కొనాలా? వేచి చూడాలా?
ప్రభుత్వం నిజంగా జీఎస్టీ తగ్గింపును అమలు చేస్తే కార్ల ధరల్లో కచ్చితంగా పెద్ద ఎత్తున ఉపశమనం లభిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి మీకు తక్షణమే కారు అవసరం అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్లు, ఫైనాన్స్ పథకాలను ఉపయోగించుకోవడం మంచిది. ఒకవేళ మీరు వేచి చూడగలిగితే దీపావళికి ముందు జీఎస్టీపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూడటం ఉత్తమం. ఈ అనిశ్చితి కొనసాగినంత కాలం ఆటోమొబైల్ మార్కెట్ కాస్త నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది.