Site icon HashtagU Telugu

Enfield: త్వ‌ర‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 లాంచ్… బైక్ టీజర్ వైరల్!

Royal

Royal

రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వ‌ర‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మోటార్ సైకిల్‌ను లాంఛ్ చేయ‌నుంది. అంత కంటే ముందు ఆ బైక్ ఎలా ఉండ‌బోతుంద‌నేది చెప్ప‌డానికి చిన్న టీజర్ విడుద‌ల చేసింది. లడఖ్ ప్రాంతంలో ఎక్కడో ఒక చిన్న నదిని దాటుతున్న మోటార్ సైకిల్‌ను చూపిస్తూ ఎన్‌ఫీల్డ్ అభిమానుల‌ను టీజ్ చేసింది.

రీసెంట్‌గా విడుద‌ల చేసిన ఆ టీజర్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 ముందు భాగాన్ని మాత్రమే చూపించారు. రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 450 హెడ్‌లైట్ లైటింగ్ కోసం హాలోజన్ బల్బును ఉపయోగించలేదు. దాని బదులుగా ఆధునిక ఎల్ఈడీలను ఉపయోగించారు. హెడ్‌లైట్ అవుట్ గోయింగ్ అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 411 త‌ర‌హాలో వృత్తాకారంగా ఉంది.

రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 450 ఇంజిన్ విష‌యానికి వ‌స్తే…  450 సీసీ లిక్విడ్ కూల్‌, సింగిల్ సిలిండ‌ర్ ఇంజిన్ ఉపయోగిస్తున్నారు. అసిస్టెంట్ క్ల‌చ్‌, 6 స్పీడ్‌ ట్రాన్స్‌మిష‌న్‌తో ఈ బైక్ రావ‌చ్చ‌ని ఆశిస్తున్నారు. ఇంకా ప‌లు మార్పులు ఉండొచ్చు. విస్తృతమైన టైర్లు, ముందు వైపున మరింత అధునాతన అడ్జస్టబుల్ USD ఫోర్కులు, రైడ్ మోడ్‌లు, ఇన్ఫర్మేటివ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొంచెం పెద్ద పెట్రోల్ ట్యాంక్ వంటివి ఉండొచ్చు.

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 విడుదలతో… ఆల్రెడీ మార్కెట్‌లో ఉన్న KTM 390 అడ్వెంచర్, BMW G310 GS వంటి శక్తివంతమైన మోటార్‌సైకిళ్లతో కంపెనీ పోటీ పడవచ్చు.  అంతే కాకుండా, కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయడం వలన చాలా మంది కొనుగోలుదారులను ఆకర్షించ‌వ‌చ్చు. అలాగే, డీల‌ర్‌షిప్‌లు కూడా! దాంతో ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడల్స్‌కు కూడా ప్రయోజనం ఉంటుంది.

ప్రస్తుతం KTM 390 అడ్వెంచర్ ధర రూ. 3.37 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) అయితే… BMW G310 GS ధర రూ. 3.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ ధరలను పరిశీలిస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ పోటీదారుల మధ్య రాబోయే హిమాలయన్ 450 ధరను సుమారు రూ. 3.25 లక్షలు ఉండొచ్చ‌ని అంచనా వేస్తున్నారు.