RELIANCE CARS : కార్ల తయారీలోకి రిలయన్స్.. MG మోటార్ పై కన్ను ?

" అందు గలదు .. ఇందు లేదు అన్న సందేహంబు వలదు.. ఎందెందు వెతికినా అందందే కలదు" అనే మాట అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఈ ఏడాది మరో సంచలనం సృష్టించేందుకు రిలయన్స్ (RELIANCE CARS) రెడీ అవుతోంది. 

Published By: HashtagU Telugu Desk
Reliance Cars

Reliance Cars

” అందు గలదు .. ఇందు లేదు అన్న సందేహంబు వలదు.. ఎందెందు వెతికినా అందందే కలదు” అనే మాట అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఈ ఏడాది మరో సంచలనం సృష్టించేందుకు రిలయన్స్ (RELIANCE CARS) రెడీ అవుతోంది.  త్వరలో కార్ల తయారీ రంగంలోకి కూడా అది అడుగు పెడుతుందని అంటున్నారు. చైనాకు చెందిన  SAIC మోటార్ ఆఫ్ చైనా గ్రూప్ కు చెందిన MG మోటార్ కార్లు చాలా ఫేమస్. ఇప్పుడు  MG మోటార్ ఇండియా విభాగంలో మెజార్టీ వాటాను కొనేందుకు ముకేశ్ అంబానీ రెడీ అవుతున్నారనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దీనికి సంబంధించి MG మోటార్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ (RELIANCE CARS) మధ్య డీల్‌ కుదిరే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం MG మోటార్ ఇండియాకు గుజరాత్‌లోని హలోల్‌లో కార్ల తయారీ యూనిట్ ఉంది. ఇందులో ప్రతి సంవత్సరం 1.2 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తున్నారు.గతంలో ఈ కార్ల ప్లాంట్ ను  ది జనరల్ మోటార్స్ నుంచి MG మోటార్ కొనుగోలు చేసింది. హలోల్‌లో రెండో కార్ల ప్లాంట్ పెట్టి  వార్షిక కార్ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని 3 లక్షలకు పెంచాలని MG మోటార్ ప్లాన్ చేసింది. ఇప్పుడు ముకేశ్ అంబానీ కానీ .. ఎవరైనా ఇండియా కుబేరుడు దాన్ని కొంటే  కార్ల మార్కెట్లో రెక్కల గుర్రంలా MG మోటార్ దశ తిరగడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
ALSO READ : Mukesh Ambani: మరో రంగంపై రిలయన్స్​ ఇండస్ట్రీస్​ కన్ను.. ఐస్‌క్రీం బిజినెస్‌లోకి అంబానీ..!

MG మోటార్ .. వాటాను ఎందుకు అమ్ముతోంది ?

SAIC మోటార్ ఆఫ్ చైనా గ్రూప్ వివిధ సంస్థాగత కారణాలతో MG మోటార్ ఇండియాలో తన మెజారిటీ వాటాను భారతీయ సంస్థలకు విక్రయించాలని ప్లాన్ చేస్తోంది. భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్లే SAIC మోటార్ ఆఫ్ చైనా ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. చైనాతో లింకులు ఉన్న చాలా కంపెనీలు వివిధ అంశాలకు సంబంధించి భారత ప్రభుత్వం నుంచి అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి.  పెట్టుబడులకు ఆమోదాలు, చైనా నుండి విడిభాగాల సోర్సింగ్, పన్నులు వంటి అంశాల్లో అవి సమస్యలను చవిచూస్తున్నాయి. ఇటువంటి తరుణంలో MG మోటార్ తన భారతీయ కార్యకలాపాలలో అదనపు పెట్టుబడుల కోసం దాని మాతృ సంస్థ (SAIC మోటార్ ఆఫ్ చైనా గ్రూప్)  నుంచి నిధులను సేకరించేందుకు భారత ప్రభుత్వ అనుమతిని కోరింది. కానీ గత 2 సంవత్సరాలుగా అనుమతి రాలేదు. దీంతో కంపెనీ ఇప్పుడు భారతీయ సంస్థల ద్వారా మూలధనాన్ని సేకరించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే మెజారిటీ వాటాను ఏదైనా  ఇండియా కంపెనీకి సేల్ చేసేందుకు సిద్ధం అయింది.MG మోటార్ ఇండియాను కొనుగోలు చేసే  రేసులో  రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో గ్రూప్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, JSW గ్రూప్ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
  Last Updated: 12 May 2023, 12:39 PM IST