Ola Shares : ఓలా ఎలక్ట్రిక్ టూవీలర్లు కొన్న పలువురు కస్టమర్లు తమ వాహన సమస్యలపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఓలా ద్విచక్ర వాహనాల్లో హార్డ్ వేర్, సాఫ్ట్‌వేర్ సమస్యలున్నాయని కొందరు.. సర్వీసు సెంటర్ల వాళ్లు పట్టించుకోవడం లేదని ఇంకొందరు పోస్టులలో గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈప్రభావం స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన ఓలా ఎలక్ట్రిక్ షేరుపై కూడా పడింది. సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారం ప్రభావంతో ఈ కంపెనీ షేరు ధర సోమవారం ఉదయం దాదాపు 8.5 శాతం మేర తగ్గిపోయి రూ.90కి (Ola Shares) చేరింది. వాస్తవానికి ఇటీవలే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ షేరు స్టాక్ మార్కెట్‌లో రూ.76 వద్ద లిస్ట్ అయింది. దాని రేటు క్రమంగా పెరిగిపోయి ఆల్ టైం హై స్థాయి రూ.157.40కి తాకింది. షేరు ధర క్రమంగా తగ్గుతూ.. దాదాపు 43 శాతం మేర పతనమై చివరకు ఇవాళ రూ.90 రేంజుకు చేరింది.
Also Read :Shafat Ali Khan : షఫత్ అలీఖాన్.. పులులకు దడ పుట్టించే మొనగాడు
ప్రభుత్వ రవాణా పోర్టల్ ‘వాహన్’ ప్రకారం.. గత నెలలో (సెప్టెంబరు) ఓలా కంపెనీ 24,665 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. అంతకుముందు ఆగస్టు నెలలో 27,587 వాహనాలను అమ్మంది. అంటే ఓలా వాహన అమ్మకాలు కొంతమేర తగ్గిపోయాయి. దీని ఎఫెక్టు కూడా షేరు ధర తగ్గడానికి ఒక కారణంగా మారిందని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు.
వాహన అమ్మకాలు తగ్గుతుండటంతో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ గత నెలలో కొన్ని కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. S1 సిరీస్ ఓలా ఈవీ స్కూటర్ హార్డ్‌వేర్‌లో సమస్యలు వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌లో లోపం ఉందంటూ కంప్లయింట్స్ వస్తున్నాయి. వాటి విడిభాగాల సప్లై కూడా ఓలాకు పెద్ద సవాల్‌గా మారింది. దీంతో ఓలా స్కూటర్లను కొన్న వందలాది మంది వినియోగదారులు ఇబ్బందిపడుతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్‌కు ప్రతినెలా సగటున దాదాపు 80వేల ఫిర్యాదులు వస్తున్నాయని తెలుస్తోంది. తన ఫిర్యాదుకు ఓలా సర్వీసు సెంటర్ నుంచి తగిన స్పందన రాకపోవడంతో విసిగి వేసారిన కస్టమర్ బరితెగించాడు. గత నెలలో కర్ణాటకలోని ఒక ఓలా షోరూంకు నిప్పుపెట్టి చాలా దారుణంగా ప్రవర్తించాడు. ఈ అంశాలన్నీ ఓలా ఎలక్ట్రిక్ షేరు పతనానికి దారితీశాయని చెబుతున్నారు.