Ola Electric: దేశవ్యాప్తంగా 200 షోరూమ్ లను ఏర్పాటు చేయనున్న ఓలా?

ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకాలను ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్ గా అగ్ర స్థానంలో నిలిచింది ఓలా ఎలక్ట్రిక్.

  • Written By:
  • Publish Date - September 21, 2022 / 09:30 AM IST

ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకాలను ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్ గా అగ్ర స్థానంలో నిలిచింది ఓలా ఎలక్ట్రిక్. అయితే ఆ అగ్రస్థానాన్ని నిలుపుకోవడానికి కష్టపడుతోంది ఓలా. కాగా దేశంలోని అనేక వాహన తయారీదారులు వారి ఉత్పత్తులను నేరుగా షోరూమ్‌లు, అలాగే డీలర్ల ద్వారా విక్రయిస్తుండగా , ఓలా ఎలక్ట్రిక్ మాత్రం ఆన్‌లైన్ సేల్ మరియు డోర్ డెలివరీ విధానానికి తెరలేపింది. అయితే మొదట్లో ఈ ప్రక్రియ బాగానే జరిగినప్పటికీ ఆ తర్వాత అనేక సమస్యలు మొదలయ్యాయి.

కాగా కస్టమర్లు ముందుగానే తమ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకున్నప్పటికీ డెలివరీలో మాత్రం భారీ జాప్యం జరగడం, డిజిటల్ పేపర్ వర్క్ సరిగా లేని కారణంగా డెలివరీలు వాయిదా పడటం, స్కూటర్‌లో సర్వీస్ సంబంధిత సమస్యలు వస్తే త్వరగా పరిష్కరించకపోవడం వంటి ఫిర్యాదులా రావడంతో ఓలా తన మనుగడను సాగించడం కోసం ఇప్పుడు మళ్లీ పాత పద్ధతికే వచ్చింది. దేశవ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లను ఏర్పాటు చేసి ద్వారా కస్టమర్లతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. కాగా మార్కెట్లోకి ఎలక్ట్రిక్ టూ వీలర్ల పోటీ రోజు రోజుకి పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో ఓలా మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఇప్పుడు నేరుగా కస్టమర్లను కలుసుకొని వారికి తమ స్కూటర్‌ను పరిచయం చేయడానికి షో రూమ్ పద్ధతిని పాటించాలని నిర్ణయించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి అనగా మార్చ్ 2023 నాటికి దేశవ్యాప్తంగా 200 షో రూమ్‌లను ప్రారంభించాలని ఓలా ఎలక్ట్రిక్ నిర్ణయించుకుంది. ప్రస్తుతం, ఆన్‌లైన్ ద్వారా ఓలా ఎలక్ట్రిక్ ప్రతి నెలా సగటున 10,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా స్కూటర్‌ను కొనుగోలు చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చని ఆన్‌లైన్ సేల్స్, సర్వీస్ పట్ల కస్టమర్లలో అవగాహన లేకపోవడం లేదా వారి ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండటం వంటి పలు కారణాల వలన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనాలని కస్టమర్లకు ఆసక్తి ఉన్నప్పటికీ, అలాంటి వారికి అందుబాటులో లేకుండా పోతున్నాయి.