ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ ఓలా గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ మార్కెట్లోకి ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్ లను విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ శాతం మంది ఇష్టపడే వాటిలో ఓలా ముందుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్ లను మాత్రమే విడుదల చేసిన ఓలా సంస్థ తాజాగా రోడ్ స్టర్ సిరీస్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను విడుదల చేసింది. ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ రోడ్ స్టర్ ఎక్స్, రోడ్ స్టర్, రోడ్ స్టర్ ప్రో అనే మూడు కొత్త మోడళ్లను తాజాగా ఆగస్టు 15, 2024 న ఆవిష్కరించారు. జెన్ 3 ప్లాట్ ఫామ్ ఆధారంగా కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సిరీస్ ను రూపొందించింది.
ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. కాగా ఓలా ఎలక్ట్రిక్ రోడ్ స్టర్ ఎక్స్, రోడ్ స్టర్ బైక్ ల డెలివరీలు వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్నాయి. అయితే రోడ్ స్టర్ ప్రో కోసం ఆసక్తి కలిగిన కస్టమర్లు 2025 దీపావళి వరకు వేచి ఉండాల్సి ఉంటుందట. అయితే అన్ని మోడళ్లకు సంబంధించి బుకింగ్ లు ఈ రోజు నుంచే ప్రారంభం అయ్యాయి. కానీ వీటికి సంబంధించిన డెలివరీలో మాత్రం వచ్చే ఏడాది జనవరిలో మొదలు కానున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ ఈ రోజు విడుదల చేసిన మూడు మోడల్స్ లో రోడ్ స్టర్ ఎక్స్ అత్యంత బడ్జెట్ ఫ్రెండ్లీ వెర్షన్ గా చెప్పవచ్చు. ఇకపోతే దీని ప్రారంభ ధర విషయానికి వస్తే రూ .74,999 గా నిర్ణయించారు. ఇందులో 2.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.
దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 200 కిలో మీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ మోటార్ సైకిల్ గరిష్ట వేగం గంటకు 124 కిలో మీటర్లు. ఇది 2.8 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఓలా రోడ్ స్టర్ ఎక్స్ లో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, 4.3 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే ఉన్నాయి. ఇకపోతే ఓలా రోడ్ స్టర్ విషయానికి వస్తే.. తాజాగావుల సంస్థ విడుదల చేసిన మూడు మోడల్స్ లో మిడ్ వేరియంట్ రోడ్ స్టర్ కూడా ఒకటి. ఈ 2.5 కిలోవాట్ వేరియంట్ ప్రారంభ ధర రూ.1,04,999 గా ఉంది. 4.5 కిలోవాట్ వేరియంట్ ధర రూ.1,19,999 కాగా, 6 కిలోవాట్ వేరియంట్ ప్రారంభ ధర రూ.1,39,999 గా నిర్ణయించారు. ఇది గరిష్టంగా గంటకు 126 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు..
0-40 కిలోమీటర్ల వేగాన్ని ఈ ఓలా రోడ్ స్టర్ బైక్ 2.2 సెకన్లలో అందుకుంటుంది. రోడ్ స్టర్ లో 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇకపోతే చివరగా ఓలా ఎలక్ట్రిక్ రోడ్ స్టర్ ప్రో విషయానికి వస్తే.. 8 కిలోవాట్ వేరియంట్ ప్రారంభ ధర రూ.1,99,999 కాగా, 16 కిలోవాట్ వేరియంట్ ధర రూ.2,49,999 గా నిర్ణయించారు. ఈ మోడల్ కు ఇతర రెండు వేరియంట్ల కంటే చాలా ఎక్కువ ధరను నిర్ణయించారు. ఈ మోటార్ సైకిల్ గరిష్ట వేగం గంటకు 194 కిలో మీటర్లు. ఇది కేవలం 1.2 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సింగిల్ ఛార్జ్ తో 579 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.