కొత్త కారు కొనుగోలు చేయాలని చూస్తున్నారా! అయితే వెంటనే కొనుగోలు చేయండి. ఎందుకంటే వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొన్ని కార్లపై ధరలు భారీగా పెరగనున్నాయి. అయితే ఇప్పటికే, జీప్, సిట్రోయెన్, స్టెల్లాంటిస్ యాజమాన్యంలోని బ్రాండ్‌లు రెండూ తమ కార్ల మొత్తం శ్రేణిలో ధరల పెంపును ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు కంపెనీలు తమ కార్ల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపాయి. ఏయే మోడళ్లకు గరిష్ట ధర పెరుగుతుందనే విషయాన్ని బ్రాండ్‌లు వెల్లడించనప్పటికీ, ధరల పెంపు నిర్దిష్ట వాహనం వేరియంట్‌పై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాయి. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను ఎదుర్కోవడానికి పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ధరల పెరుగుదల తప్పనిసరిగా జీప్, సిట్రోయెన్ రెండూ పేర్కొన్నాయి.
ఇన్‌పుట్ ఖర్చులు, మారకపు రేట్లు పెరగడం ద్వారా ధరల సవరణ అవసరం. కస్టమర్ లకు విలువ, అధిక నాణ్యత, డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించడం పైనే దృష్టి సారించనున్నాం అని మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శైలేష్ హజెలా స్టెల్లంటిస్ ఇండియా అన్నారు. అయితే ఈ నెల అనగా డిసెంబర్ 31, 2024 వరకు అందుబాటులో ఉండే ఆకర్షణీయమైన సంవత్సరాంతపు ఆఫర్‌లతో పాటు, ప్రస్తుత ధరలో జీప్ లేదా సిట్రోయెన్ వాహనాలను కొనుగోలు చేసే అవకాశాన్ని స్టెల్లంటిస్ ఇండియా అందిస్తోంది. ఇండియా మార్కెట్లో జీప్ వాహన రేంజ్‌లో రాంగ్లర్, కంపాస్, మెరిడియన్, గ్రాండ్ చెరోకీ ఉన్నాయి. ఉత్తర అమెరికా వెలుపల జీప్ బ్రాండ్ స్థానికంగా 4 మోడళ్లను తయారు చేసే మొదటి దేశం ఇండియా మాత్రమే. దేశీయ డిమాండ్, ప్రపంచవ్యాప్తంగా రైట్ హ్యాండ్ డ్రైవ్ మార్కెట్ లకు ఎగుమతులు రెండింటినీ అందిస్తోంది.
అదే సమయంలో, ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ ఇండియా లైనప్ లో సి3, బసాల్ట్, ఎయిర్‌క్రాస్, సి5 ఎయిర్ క్రాస్ ఉన్నాయి. కంపెనీ భారతీయ మార్కెట్ లో ఈ సి3ని తన ఏకైక ఎలక్ట్రిక్ వాహనంగా కూడా అందిస్తోంది. మారుతీ సుజుకి ఇండియా, టాటా మోటార్స్, కియా ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా, మెర్సిడెస్ బెంజ్ ఇండియా, బీఎండబ్ల్యూ ఇండియా తమ కార్లపై జనవరి 2025 నుంచి 4 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, అధిక వస్తువుల ధరలు, పెరిగిన కార్యాచరణ ఖర్చులు, అననుకూలమైన మారకపు రేట్లు, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడం వంటి ఇతర కారణాల వల్ల ధరలను పెంచాలనే నిర్ణయానికి వచ్చాయి.
జనవరి 2025లో మారుతీ కార్ల ధర 4శాతం వరకు పెరుగుతుంది. మోడల్‌ను బట్టి ధరల పెంపు మారుతూ ఉంటుంది. టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వాహనాలు,ఎలక్ట్రిక్ వాహనాల ధరలను జనవరి 2025 నుంచి 3శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. అలాగే కియా ఇండియా జనవరి 2025 నుంచి తమ కార్ల ధరలను 2శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. జనవరి 1, 2025 నుంచి హ్యుందాయ్ తన కార్ల ధరలను రూ. 25వేల వరకు పెంచనుంది. జనవరి 2025 నుంచి మహీంద్రా ఎస్‌యూవీలు 3శాతం వరకు ఖరీదైనవిగా మారనున్నాయి.