Site icon HashtagU Telugu

Indian Roadmaster Elite: ప్రపంచవ్యాప్తంగా కేవలం 350 మాత్రమే ఉన్న ఈ బైక్స్ ప్రత్యేకతలు ఏంటో మీకు తెలుసా?

Indian Roadmaster Elite

Indian Roadmaster Elite

అమెరికన్ బైక్ తయారీ సంస్థ ఇండియన్ మోటార్ సైకిల్స్ ఇటీవల తన రోడ్ మాస్టర్ టూరర్ లిమిటెడ్ ఎడిషన్‌ ను ఇండియాలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ బైక్ ధర రూ .71.82 లక్షలుగా ఉంది. అయితే ఈ రోడ్ మాస్టర్ ఎలైట్ కేవలం 350 యూనిట్లు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా తయారు చేస్తారు. ఇండియాలో అత్యంత ఖరీదైన బైకుల్లో ఇది ఒకటి. 1901 లో స్థాపించబడిన ఇండియన్ మోటార్ సైకిల్ ఒక అమెరికన్ బైక్ బ్రాండ్. ఇండియన్ రోడ్ మాస్టర్ ఎలైట్ సింగిల్ ట్రై టోన్ పెయింట్ స్కీమ్‌ లో లభిస్తుంది. ఇది ఐకానిక్ ఇండియన్ మోటార్ సైకిల్ రెడ్ కలర్ 1904 కు గుర్తుగా రూపొందించారు.

ఈ పెయింట్ స్కీమ్ ముదురు ఎరుపు, నలుపు రంగును కలిగి ఉంటుంది. ఈ బైక్ కు హ్యాండ్ పెయింటెడ్ గోల్డ్ పిన్స్ స్ట్రిప్స్ కూడా లభిస్తాయి. కాగా ఈ పెయింట్ పని పూర్తి కావడానికి 24 గంటలకు పైగా సమయం పడుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ ప్రత్యేకమైన రంగుతో పాటు, రోడ్ మాస్టర్ ఎలైట్‌ను ప్రత్యేక ఎలైట్ బ్యాడ్జింగ్, వ్యక్తిగత సంఖ్యతో సెంటర్ కన్సోల్‌ తో చేశారు. ఇండియన్ రోడ్ మాస్టర్ ఎలైట్‌లో థండర్ స్ట్రోక్ 1,890 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్‌ తో వస్తుంది. ఈ వి ట్విన్ యూనిట్‌తో, టూరర్ 2,900 ఆర్‌పీఎమ్ వద్ద 170 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్‌ గా పనిచేస్తాయి.

టూరర్ ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌ లు, వెనుక భాగంలో సింగిల్ డిస్క్ బ్రేక్‌ లతో పనిచేస్తుంది. అలాగే రోడ్ మాస్టర్ ఎలైట్‌లో శాడిల్ బ్యాగ్‌లపై ఎల్‌ఈడీ హెడ్ లైట్లు, ఆక్సిలరీ ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయి. ఫ్రంట్ ఫేరింగ్, శాడిల్ బ్యాగ్స్, ట్రంక్‌ లలో 12 స్పీకర్ల పవర్ బ్యాండ్ ఆడియో సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. ట్రంక్, శాడిల్ బ్యాగ్‌ల కోసం ప్రతి స్టోరేజ్ యూనిట్ వెదర్ ప్రూఫ్, కన్సోల్ లేదా కీఫోబ్ నుండి రిమోట్ లాకింగ్‌ ను కూడా కలిగి ఉంటుంది. ఈ కన్సోల్ 7 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది జీపీఎస్ నావిగేషన్ ఫంక్షనాలిటీతో పాటు క్రూయిజ్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇతర విషయాలను కూడా అందిస్తుందట. రైడ్ కమాండ్+ తో కూడిన డిస్ ప్లే ఆపిల్ కార్ ప్లే, బైక్ లొకేటర్, బైక్ హెల్త్ వంటి ఫీచర్లను అన్ లాక్ చేస్తుంది. రోడ్ మాస్టర్ ఎలైట్ రైడర్, ప్యాసింజర్ ఇద్దరికీ సీట్లను అందంగా తయారు చేసింది. దీని సెట్టింగ్‌ లను సర్దుబాటు చేయవచ్చు. ఇందులో ప్యాసింజర్ ఆర్మ్ రెస్ట్, ఫ్లోర్ బోర్డ్‌లు, కీలెస్ ఇగ్నీషన్ కూడా లభిస్తాయట.