Rs 7300 Crore Fine : కార్లు, ఎస్‌యూవీలు తయారు చేసే 8 కంపెనీలకు షాక్ ఇచ్చే వార్త ఇది. ఎందుకంటే వాటిపై దాదాపు రూ.7,300 కోట్ల పెనాల్టీ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ ఫైన్‌ను ఎదుర్కోనున్న కంపెనీల లిస్టులో హ్యుందాయ్, మహీంద్రా, కియా, హోండా, రెనాల్ట్, స్కోడా, నిస్సాన్, ఫోర్స్ మోటార్స్ ఉన్నాయి. అత్యధికంగా హ్యుందాయ్ కంపెనీపై రూ.2,837.8 కోట్ల ఫైన్ వేయనున్నారు. మహీంద్రాపై రూ.1788.4 కోట్లు, కియాపై రూ.1346.2 కోట్లు, హోండాపై రూ.457.7కోట్లు, రెనాల్ట్‌పై రూ.438.3కోట్లు, స్కోడాపై రూ.248.3కోట్లు, నిస్సాన్‌పై రూ.172.3కోట్లు, ఫోర్స్ మోటార్స్‌పై రూ.1.8 కోట్ల పెనాల్టీలు విధించే ఛాన్స్ ఉంది. అయితే ఇంత భారీ ఫైన్స్ వేయడంపై ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు, కేంద్ర ప్రభుత్వ వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
Also Read :Residential Hostels Issue : విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలి.. ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం సీరియస్
ఇంతకీ ఎందుకీ ఫైన్స్ ?
- కేంద్ర ఇంధన శాఖకు చెందిన ఎనర్జీ ఎఫీషియెన్సీ విభాగం 2022-23 ఆర్థిక సంవత్సరం ఆరంభంలో కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్య నిబంధనలను(Rs 7300 Crore Fine) కఠినతరం చేసింది.
- ఆ నిబంధనల ప్రకారం.. ఆటోమొబైల్ కంపెనీలు విక్రయించే ప్రతీ కారులో ప్రతి 100 కిలోమీటర్లకు ఇంధన వినియోగం 4.78 లీటర్లకు మించకూడదు. దీంతోపాటు ప్రతి కిలోమీటరు ప్రయాణానికి వాహనం నుంచి వాతావరణంలోకి వెలువడే కర్బన ఉద్గారాలు 113 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు.
- అయితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8 ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన కార్లు, ఎస్‌యూవీలలో కర్బన ఉద్గారాల స్థాయి ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
- ఇంధన వినియోగం, కర్బన ఉద్గారాలకు సంబంధించిన కొత్త రూల్స్ 2023 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయని ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ 8 ఆటోమొబైల్ కంపెనీలపై ఈ రూల్స్ ప్రకారం జరిమానాలు విధిస్తామని చెప్పడంపై కంపెనీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. రూల్స్ అమల్లోకి రావడానికి కొన్ని నెలల ముందు.. ఆయా కంపెనీల కార్లలో కాలుష్య స్థాయులు ఎక్కువగా ఉంటే ఫైన్ వేయడం సరికాదని అంటున్నాయి.