Hyundai Electric Cars: టెస్లాకు పోటీగా హ్యుందాయ్.. అయానిక్ 6 ఎలక్ట్రిక్ కారు విడుదల

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీ మొదలైంది. దిగ్గజ కంపెనీ టెస్లాకు పోటీ ఇచ్చేందుకు హ్యుందాయ్ సిద్ధమైంది.

  • Written By:
  • Publish Date - July 1, 2022 / 09:00 AM IST

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీ మొదలైంది. దిగ్గజ కంపెనీ టెస్లాకు పోటీ ఇచ్చేందుకు హ్యుందాయ్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఓ ఎలక్ట్రిక్ కారును గురువారం విడుదల చేసింది.హ్యుందాయ్ అయానిక్ 6 (Hyundai Ioniq 6) ను ఆవిష్కరించింది. మొన్న “కియా” కంపెనీ ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురాగా .. ఇవాళ హ్యుందాయ్ విడుదల చేసింది. అయానిక్ 6 విషయానికొస్తే.. ఇది సెడాన్ మోడల్ కారు. దీని ముందు భాగంలో 700 పారామెట్రిక్ పిక్సెల్ హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి. ఫ్రంట్ బంపర్‌లో నిలువు మూలకాలతో అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. సైడ్స్‌లో చాలా స్పోర్టీగా కనిపించే అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.ఈ కారు తయారీలో స్మూత్ బాడీ ప్యానెల్స్‌ని ఉపయోగించారు. హ్యుందాయ్ అయానిక్ 6 వెనుక భాగం వెనుక విండో క్రింద చక్కగా ఇంటిగ్రేట్ చేయబడిన స్పాయిలర్ మరియు దాని క్రింద డక్‌టైల్ స్పాయిలర్‌ ఉంటాయి. అంతే కాకుండా, వెనుక బంపర్ కూడా ఫ్రంట్ బంపర్ మాదిరిగానే నిలువు మూలకాలను కలిగి ఉంటుంది. వెనుక వైపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, రియర్ స్పాయిలర్‌లో ఎల్ఈడి స్టాప్ ల్యాంప్స్ ఉన్నాయి.

సైడ్ మిర్రర్స్ ఉండవు..

ఈ కారు మోడల్ లో సైడ్ మిర్రర్స్ ఉండవు. వాటి స్థానంలో హెచ్‌డీ కెమెరాలు ఉంటాయి. ఇవి రోడ్డుకి ఇరువైపులా.. వెనుకగా వస్తున్న ట్రాఫిక్ ను వీడియో తీసి క్యాబిన్ లోపల స్క్రీన్ పై కనిపించేలా చేస్తాయి. బటన్-లెస్ డోర్ ప్యానెల్స్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, సింగిల్ డాష్ ఫ్రేమ్‌ ఉంటాయి. ఈ కారులో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ , ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ కోసం రెండు పెద్ద 12 ఇంచ్ స్క్రీన్‌లను బిగించారు. డ్యాష్‌బోర్డుకి ఇరువైపులా అంచులలో ఉన్న మరో రెండు స్క్రీన్‌లు గతంలో పేర్కొన్నట్లుగా ఈ కారులో సైడ్-వ్యూ కెమెరాలకు డిస్‌ప్లేలుగా పనిచేస్తాయి. ఇక ఈ కారులో లభించే ఇతర ఫీచర్లను గనిస్తే, ఇందులో 64 రకాల ఆంబియంట్ లైటింగ్‌తో పలు ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారు తొలుత ఐరోపా, ఉత్తర అమెరికా మార్కెట్లలో విడుదల కానుంది. భారత్ లోకి రావడానికి ఇంకొంత సమయం పట్టొచ్చు. దీని ప్రారంభ ధర దాదాపు రూ.40 లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక హ్యుందాయ్ కంపెనీకి చెందిన అయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు మోడల్ ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానుంది.