కేంద్ర ప్రభుత్వం ఇటీవల వాహనాలపై జీఎస్టీ (GST) రేటును తగ్గించి కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ద్విచక్ర వాహనాలపై 28% జీఎస్టీ ఉండగా, ఇప్పుడు దాన్ని 18%కి తగ్గించారు. ఈ కొత్త పన్ను రేటు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయం పండుగ సీజన్‌కు ముందు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి గొప్ప బహుమతి అని చెప్పవచ్చు. ఈ తగ్గింపు వలన, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లైన హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ వంటి వాటి ధరలు గణనీయంగా తగ్గుతాయి.
ఈ జీఎస్టీ తగ్గింపు ఎక్కువగా 350సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం గల వాహనాలకు వర్తిస్తుంది. ఇది భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా అమ్ముడయ్యే వాహనాల విభాగం. ధరల తగ్గింపు అనేది చూస్తే..
హోండా యాక్టివా 100: ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 84,173 (28% జీఎస్టీతో). కొత్త రేటుతో ఇది సుమారు రూ. 76,000 కు తగ్గుతుంది, దీని వల్ల కస్టమర్లకు దాదాపు రూ. 8,000 ఆదా అవుతుంది.
టీవీఎస్ జూపిటర్ 110: ప్రస్తుత ధర రూ. 81,831. కొత్త జీఎస్టీ రేటుతో ఇది రూ. 74,000కు తగ్గుతుంది, అంటే సుమారు రూ. 7,000 ఆదా అవుతుంది.
సుజుకి యాక్సెస్ 125: ప్రస్తుత ధర రూ. 87,351. ఇది సుమారు రూ. 79,000కు తగ్గుతుంది.
హీరో స్ప్లెండర్ బైక్: ప్రస్తుత ధర రూ. 79,426. ఇది రూ. 71,483కు తగ్గుతుంది, అంటే సుమారు రూ. 7,943 ఆదా అవుతుంది.
దసరా, ధంతేరస్, దీపావళి వంటి పండుగ సీజన్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం టూవీలర్ల అమ్మకాలను భారీగా పెంచుతుందని భావిస్తున్నారు. కొత్త వాహనాలు కొనడానికి పండుగలను చాలామంది శుభప్రదంగా భావిస్తారు. ధరల తగ్గుదల వినియోగదారులకు నేరుగా ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తుంది.