Hero Electric Scooter: డుర్ డుర్ మంటూ శబ్దం చేస్తూ, వదిలే పొగతో పర్యావరణాన్నికాలుష్య పరుస్తున్న స్కూటర్‌ల స్థానంలో ఇప్పుడు రయ్.. రయ్.. మంటూ వచ్చిన హీరో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో తీసుకొచ్చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు మార్కెట్లో గట్టి పోటీ ఓ రేంజ్‌లో ఉండనుంది. ఇప్పటికే హీరో పోటీ సంస్థలు టీవీఎస్, బజాజ్‌లు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ సమయంలో హీరో రాకతో.. పోటీ మరింత పెరగనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, స్పెషిఫికేషన్లు, ఎన్ని కి.మీ లు ప్రయాణించగలదో వంటి వివరాలను క్రింద తెలుసుకోండి.
Hero First Electric Scooter:
దసరా పండగ సందర్భంగా దేశంలోనే అతిపెద్ద టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ తన సరికొత్త, తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌తో వాహనదారుల ముందుకు వచ్చేసింది. హీరో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విదా వీ1(Vida V1) పేరుతో రెండు రకాలలో లాంచ్ చేసింది. దీని ధర ఎక్స్‌షోరూంలో రూ.1.45 లక్షల నుంచి రూ.1.59 లక్షల మధ్యలో ఉంది.
విదా వీ1 ప్లస్, విదా వీ1 ప్రొ పేరుతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు వాహనదారులకు అందుబాటులో ఉంటాయి. గంటకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే విదా వీ ప్రొ 165 కి.మీలు ప్రయాణించనుంది. 3.2 సెకన్లలో ఈ స్కూటర్ గంటకు జీరో నుంచి 40 కి.మీల మేర అందుకోనుంది. వీ1 పప్లస్ వేరియంట్.. 143 కి.మీలు ప్రయాణించనుంది. 3.4 సెకన్లలో గంటకు 0-40 కి.మీలను అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 80 కిలోమీటర్లు.
ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌కు ఛార్జ్ చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.ఈ స్కూటర్‌లో హీరో మోటోకార్ప్ రిమూవబుల్ బ్యాటరీని అందిస్తుంది. అంతేకాక పోర్టబుల్ ఛార్జర్‌ను కూడా ఆఫర్ చేస్తుంది. అంటే ఎక్కడికైనా ఈ వెహికిల్ ఛార్జర్‌ను తీసుకెళ్లొచ్చు. తేలిగ్గా దీన్ని క్యారీ చేయొచ్చు.
Vida V1 కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రమే కాదని, ఇది పవర్ ఛేంజ్‌గా నిలవనుందని హీరో మోటోకార్ప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ తెలిపారు. జర్మనీలో టెక్ సెంటర్‌లో గల ఇంజనీర్లతో కలిసి, జైపూర్‌లో కంపెనీకున్న ఇన్నొవేషన్ అండ్ టెక్నాలజీసెంటర్(CIT)లో విదా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ అభివృద్ధి చేసింది. కాలుష్యానికి కారకమయ్యే ఉద్గారాలను తగ్గించడంలో విదా వీ1 కీలక పాత్ర పోషించనుందని పవన్ ముంజాల్ తెలిపారు.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్(Electric Scooter):
వీటి బుకింగ్స్‌ను హీరో మోటోకార్ప్ ఢిల్లీ, బెంగళూరు, జైపూర్‌లలో ఈ నెల పది నుంచి ప్రారంభించనుంది. డిసెంబర్ రెండో వారం నుంచి డెలివరీలను ప్రారంభించనుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ వెహికిల్ అమ్మకాలను కూడా చేపట్టనుంది.
చేతక్ పేరుతో బజాజ్ తన స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రజల ముందుకు తీసుకు రాగా.. టీవీఎస్ ఐక్యూబ్(iQube) పేరుతో తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఓలా ఎస్1 ప్రొ, అథెర్ 450ఎక్స్ జెన్3, బజాజ్ చెతక్, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీవ్ర పోటీ ఇవ్వనుంది.
ఎలక్ట్రిక్ టూవీలర్ అమ్మకాలు భారీగా పెరుగుతున్న సమయంలో హీరో మోటోకార్ప్(Hero Motocorp) సంస్థ తన తొలి ఎలక్ట్రిక్ వెహికిల్‌ను తీసుకొచ్చింది. ఈ-మొబిలిటీలోకి మారే వినియోగదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను అందజేస్తున్నాయి. మరోవైపు ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్‌లో ఓలా తన సరికొత్త వెహికిల్స్‌ను ప్రవేశపెడుతూ దూసుకొని వెళ్తుంది. దిగ్గజాలు సైతం ఈ మార్కెట్లోకి అడుగు పెట్టడంతో.. పోటీ మరింత పెరగనుంది.
