Ola Refund : ‘ఓలా’ విషయంలో కేంద్ర ప్రభుత్వం వరుస పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీసు సెంటర్లకు సంబంధించి ముఖ్య ఆదేశాలను కేంద్రం జారీ చేసింది. సోషల్ మీడియాలో ఎంతోమంది ప్రముఖులు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీసింగ్ బాగా లేదంటూ పోస్టులు పెట్టారు. తాజాగా ఓలా క్యాబ్ సర్వీసులపైనా కేంద్ర సర్కారు స్పందించింది. కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) ఓలాకు ముఖ్య ఆర్డర్స్‌ను జారీ చేసింది. వినియోగదారులకు అనుకూల విధానాలను అమలు చేయాలని కోరింది. కస్టమర్లకు రీఫండ్ ఆప్షన్లను అందుబాటులోకి తేవాలని సూచించింది. ఓలా రైడ్‌కు సంబంధించిన రసీదులను ఇవ్వాలని నిర్దేశించింది.
Also Read :Ayyappa Devotees : శబరిమల అయ్యప్ప భక్తుల దర్శనాలపై మూడు కీలక నిర్ణయాలు
- ఓలా క్యాబ్‌లు బుక్ చేసుకునే వారికి ప్రస్తుతం రీఫండ్ అమౌంటు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదు. రీఫండ్ అమౌంటును కూపన్ కోడ్‌లా మార్చి కస్టమర్లకు ఓలా అందిస్తోంది. భవిష్యత్తులో మరో రైడ్‌ను బుక్ చేసుకున్నప్పుడు.. ఈ కోడ్‌ను వాడుకొని రీఫండ్ అమౌంటును పొందుతున్నారు. ఈనేపథ్యంలో కస్టమర్లకు వివిధ రకాల రీఫండ్ ఆప్షన్లు ఇవ్వాలని ఓలాకు సీసీపీఏ సూచించింది. రీఫండ్ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాకు పంపుకునే అవకాశాన్ని కల్పించాలని నిర్దేశించింది.
- రైడ్‌లకు సంబంధించిన బిల్లులు, ఇన్‌వాయిస్‌లు కూడా జారీచేయాలని ఓలాను(Ola Refund) సీసీపీఏ ఆదేశించింది.
- తాము ఇచ్చిన ఈ ఆదేశాలను పాటించకుంటే.. అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నట్లుగా పరిగణించాల్సి వస్తుందని సీసీపీఏ వెల్లడించింది.
- ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు తమకు ఓలాపై దాదాపు 2061 ఫిర్యాదులు వచ్చాయని సీసీపీఏ తెలిపింది.
- సీసీపీఏ ఆదేశాల అమలులో భాగంగా ఓలా తమ వెబ్‌సైటులో గ్రీవెన్స్, నోడల్ ఆఫీసర్ల కాంటాక్ట్ వివరాలను, క్యాన్సిలేషన్ నిబంధనలను, బుకింగ్, క్యాన్సిలేషన్ ఫీజుల సమాచారాన్ని పొందుపర్చింది.