New Rules : ప్ర‌తి కారుకు 6 ఎయిర్ బ్యాగ్ లు మ‌స్ట్‌..అక్టోబ‌ర్ 1 నుంచి అమ‌లు

ప్ర‌తి కారుకు ఆరు ఎయిర్ బ్యాగ్ లు ఉండాల‌నే నిబంధ‌న వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి కేంద్రం అమ‌లు చేయ‌నుంది.

  • Written By:
  • Updated On - September 29, 2022 / 03:22 PM IST

ప్ర‌తి కారుకు ఆరు ఎయిర్ బ్యాగ్ లు ఉండాల‌నే నిబంధ‌న వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి కేంద్రం అమ‌లు చేయ‌నుంది. కార్ల త‌యారీ దార్ల‌కు ఇప్ప‌టికే కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఇచ్చేసింది. ఆ విష‌యాన్ని కేంద్ర రోడ్డు ర‌వాణా, ర‌హ‌దారుల మంత్రి నితిన్ గ‌డ్క‌రీ వెల్ల‌డించారు. మోటారు వాహనాలలో ప్రయాణించే ప్రయాణికులందరి భద్రత, ధ‌ర‌ల‌తో సంబంధంలేకుండా అన్ని వేరియెంట్ల‌లో ఆరు ఎయిర్ బ్యాగ్ లు ఉండాల్సిందేన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఆటో పరిశ్రమ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, స్థూల ఆర్థిక అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ప్యాసింజర్ కార్లలో (M-1 కేటగిరీ) కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసే ప్రతిపాదనను అమలు చేయాలని నిర్ణయించారు. ఆ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

ప్రయాణీకులందరికీ సీట్‌బెల్ట్ తప్పనిసరి
టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత, నిపుణులు ట్రాఫిక్‌ నియంత్రణ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపారు. కారు ప్రయాణీకుల కోసం సీటుబెల్ట్‌లను నియంత్రించే చట్టాలపై ఎప్పటికీ అంతులేని ఊహాగానాలు ఉన్నాయి. వాటి న‌డుమ‌ ప్రభుత్వం సెప్టెంబర్‌లో కారులో ప్రయాణీకులందరికీ సీట్‌బెల్ట్‌ను తప్పనిసరి చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో శిక్షించబడతారు. సైర‌స్ మిస్త్రీ ప్ర‌మాదం స‌మ‌యంలో ముందు సీట్లలో ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చారని, అయితే సీట్‌బెల్ట్‌లు పెట్ట‌క‌పోవ‌డంతో వెనుక భాగంలో ఉన్నవి పాప్ అవుట్ కాలేదని పోలీసులు తెలిపారు. అందుకే, సీటు బెల్ట్‌, ఆరు ఎయిర్ బ్యాగ్ ల కార్ల‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి ఆదేశాల‌ను అమ‌లు చేయాల‌ని రాష్ట్రాల‌కు తెలియ‌చేసింది.