Maruti Suzuki Cars: దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ అయిన మారుతి సుజుకి (Maruti Suzuki Cars) పండుగల సీజన్‌కు ముందు వినియోగదారులకు ఒక గొప్ప శుభవార్త అందించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కార్లపై విధించే జీఎస్టీ రేట్లను తగ్గించగా ఆ ప్రయోజనాన్ని పూర్తిగా వినియోగదారులకే బదిలీ చేస్తున్నట్లు మారుతి ప్రకటించింది. ఈ నిర్ణయంతో అనేక మారుతి మోడళ్ల ధరలు ఏకంగా లక్షల రూపాయల వరకు తగ్గాయి. ముఖ్యంగా చిన్న, బడ్జెట్ కార్ల ధరలు గణనీయంగా తగ్గాయి.
కొన్ని ముఖ్యమైన ధరల తగ్గింపులు
- ఎస్-ప్రెస్సో (S-Presso) ధర దాదాపు రూ. 1.29 లక్షలు తగ్గింది.
- ఆల్టో కే10 (Alto K10) ఇప్పుడు రూ. 1.07 లక్షలు తక్కువ ధరకే లభిస్తోంది.
- ఎస్‌యూవీల విభాగంలో ఫ్రాంక్స్ (Fronx), బ్రెజా (Brezza) ధరలు రూ. 1.12 లక్షల వరకు తగ్గాయి.
Also Read: Apollo: అపోలో.. పురాతన గ్రీకు, రోమన్ పురాణాలలో ప్రముఖ గాడ్!
జీఎస్టీ రేట్లలో మార్పు
ప్రభుత్వం ఇటీవల కార్ల జీఎస్టీ రేట్లలో పెద్ద మార్పు తీసుకొచ్చింది.
దీని ప్రకారం.. చిన్న కార్లు (4000mm కన్నా తక్కువ పొడవు, 1200cc లోపు పెట్రోల్ ఇంజిన్ లేదా 1500cc లోపు డీజిల్ ఇంజిన్) పై జీఎస్టీ రేటు 28% నుండి 18%కి తగ్గింది. పెద్ద కార్లు, ఎస్‌యూవీలు (4000mm కన్నా ఎక్కువ పొడవు, 1200cc పైన పెట్రోల్ ఇంజిన్ లేదా 1500cc పైన డీజిల్ ఇంజిన్) పై జీఎస్టీ 40% గా ఉంది. ఈ మార్పు వల్ల టూ-వీలర్ నుంచి కార్లకు అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం.
ఈ నిర్ణయం ఎందుకు ప్రయోజనకరం?
గత కొన్ని నెలలుగా ఆటోమొబైల్ రంగం నెమ్మదిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మారుతి తీసుకున్న ఈ ధరల తగ్గింపు నిర్ణయం డిమాండ్‌ను పెంచడానికి సహాయపడుతుంది. మారుతి సుజుకి మార్కెటింగ్, సేల్స్ విభాగం అధిపతి పార్తో బెనర్జీ మాట్లాడుతూ.. తాము కేవలం జీఎస్టీ తగ్గింపునే కాకుండా అదనంగా 8.5% డిస్కౌంట్ కూడా ఇస్తున్నామని చెప్పారు. దీనివల్ల ఎక్కువ మంది ప్రజలు కారు కొనే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
ఎవరికి ఎక్కువ ప్రయోజనం?
హ్యాచ్‌బ్యాక్ కొనుగోలుదారులు: S-Presso, Alto K10, Celerio వంటి మోడళ్లపై రూ. 90,000 నుండి రూ. 1.29 లక్షల వరకు ధరలు తగ్గాయి.
కుటుంబాలు- ట్యాక్సీ ఆపరేటర్లు: Dzire, Ertiga, XL6 వంటి కార్ల ధరలు కూడా తగ్గడంతో ఇవి కుటుంబాలకు, ట్యాక్సీ వ్యాపారులకు గొప్ప ఎంపికగా నిలుస్తాయి.
నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి!
కొత్త ధరలతో పాటు స్పేర్ పార్ట్స్, సర్వీసింగ్ ఖర్చులు కూడా తగ్గుతాయని మారుతి స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు దీర్ఘకాలంలో నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నవారికి ఇది నిజంగా ఒక మంచి అవకాశం.
