Site icon HashtagU Telugu

Toll Tax: గుడ్ న్యూస్‌.. టోల్ ప్లాజాల్లో ఈ వాహ‌నాల‌కు నో ట్యాక్స్‌!

Toll Tax

Toll Tax

Toll Tax: మహారాష్ట్రలోని ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు ఇది శుభవార్త. రాష్ట్రంలోని ప్రధాన టోల్ ప్లాజాల వద్ద ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ పన్ను (Toll Tax) మినహాయింపు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మార్గదర్శనంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆగస్టు 21 నుండి మినహాయింపు

అటల్ సేతు, ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే, సమృద్ధి మహామార్గ్ సహా అన్ని టోల్ ప్లాజాల వద్ద ఆగస్టు 21 నుండి ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ పూర్తిగా మినహాయించబడుతుందని రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు. ఇంతకు ముందు అటల్ సేతుపై కారు టోల్ రుసుము రూ. 250గా నిర్ణయించారు. ఇది డిసెంబర్ 2025 వరకు అమలులో ఉండాలి. కానీ ఇప్పుడు ఈవీ యజమానులు ఈ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు.

మహారాష్ట్ర ఈవీ విధానం ప్రభావం

ఏప్రిల్ 2025లో ప్రభుత్వం కొత్త మహారాష్ట్ర ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని అమలు చేసింది. ఈ విధానంలో భాగంగానే ప్రధాన టోల్ ప్లాజాల వద్ద ఎలక్ట్రిక్ బస్సులకు, ప్రైవేట్ ఈవీ కార్లకు టోల్ మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. ఇతర జాతీయ, రాష్ట్ర రహదారులపై ఎలక్ట్రిక్ కార్లకు 50% రాయితీ కూడా కల్పించారు.

Also Read: Kohli- Rohit: వ‌న్డేల‌కు రోహిత్‌, కోహ్లీ వీడ్కోలు ప‌ల‌క‌నున్నారా? బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

అమలు ఎలా?

రవాణా కమిషనర్ వివేక్ భీమన్వార్ ప్రకారం.. అటల్ సేతుపై ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ మినహాయింపు అమలు చేయడానికి సాఫ్ట్‌వేర్ సిద్ధం చేశారు. దీనిని వెంటనే అమలులోకి తెచ్చారు. ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే, సమృద్ధి మహామార్గ్ వద్ద ఈ సౌకర్యం తదుపరి రెండు రోజులలో ప్రారంభమవుతుంది.

ఎవరికి లాభం?

ఈ పథకం ప్రయోజనం కేవలం ప్రైవేట్, ప్రభుత్వ ఎలక్ట్రిక్ కార్లు, బస్సులకు మాత్రమే లభిస్తుంది. ఎలక్ట్రిక్ గూడ్స్ వాహనాలకు ఈ మినహాయింపు వర్తించదు. ఈ చర్యతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడానికి ప్రోత్సహించబడతారని, సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈవీల డిమాండ్ పెరుగుతోంది

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ప్రస్తుతం ముంబై, దాని పరిసర ప్రాంతాలలో 22,400కి పైగా ఈవీలు నమోదయ్యాయి. వీటిలో 18,400 తేలికపాటి నాలుగు చక్రాల వాహనాలు, 2,500 చిన్న ప్యాసింజర్ వాహనాలు, 1,200 భారీ బస్సులు, దాదాపు 300 మధ్యస్థ వాహనాలు ఉన్నాయి. సగటున ప్రతి రోజు అటల్ సేతుపై నుంచి దాదాపు 60 వేల వాహనాలు వెళ్తున్నాయి. వీటిలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది.