Car Price Hike : కారు కొనాలనుకుంటున్నారా…?మీకు షాకింగ్ న్యూస్..!!

  • Written By:
  • Publish Date - March 29, 2022 / 04:39 PM IST

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీదారు సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా…కారు ప్రియులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. అన్ని కారు మోడల్స్ పై ఏకంగా 3.5శాతం మేర ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరిగిన మెటీరియల్ రేట్లు, లాజిస్టిక్ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ధరలు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదే క్రమంలో మరో లగ్జరీ కార్లు తయారీ సంస్థ అయిన మెర్సిడెస్-బెంజ్ ఇండియా కూడా తన కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఇక పెరిగిన ధరలు ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా తన అన్ని మోడల్స్ పై 3శాతం ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. లాజిస్టిక్స్ రేట్లు పెరుగుదలతో పాటు ఇన్ పుట్ ఖర్చులు కూడా పెరగడంతో కారు మోడల్స్ పై ధర పెంచుతున్నట్లు ప్రకటించింది.

కొత్త ధరలు…
వీటితోపాటు ఆడి కూడా భారత్ లో తన అన్ని మోడల్స్ పై 3శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్ పుట్ ఖర్చు ల కారణంగానే ధరలు పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1,2022 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ మాట్లాడుతూ…భారత్ మాకు గణనీయమైన మార్కెట్ ఉన్న దేశం. ఇక్కడ మేము స్థిరమైన వ్యాపార నమూనాను నిర్వహించడానికి కట్టుబడి ఉన్నాము. అయితే పెరుగుతున్న ధరల కారణంగా అన్ని మోడల్స్ పై 3శాతం ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

టాటామోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి…
ఆడి ఇండియా ప్రస్తుతం లైనప్ లోఉన్న ఆడి A4, A6, A8L, Q2, Q5మోడల్స్ తోపాటు ఈ మధ్యే ప్రారంభించిన ఆడి Q7, Q8, S5స్పోర్ట్ బ్యాక్, ఆడి ఆర్ఎస్ 5 స్పోర్ట్ బ్యాక్, ఆర్ఎస్ 7 స్పోర్ట్ బ్యాక్, ఆర్ఎస్ క్యూ8 మోడల్స్ పై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా తన వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొన్ని పాపులర్ మోడల్స్ పై 2 నుంచి 2.5శాతం ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగత మోడల్, వేరియంట్ ఆధారంగా ఏప్రిల్ 1,2022 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది.