Site icon HashtagU Telugu

EV Car Care: వర్షంలో ఈవీ కారును చార్జింగ్ చేయవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Mixcollage 17 Jul 2024 04 44 Pm 4298

Mixcollage 17 Jul 2024 04 44 Pm 4298

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కేవలం ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ బైక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ ఈవీ వాహనాలను వినియోగదారులు ఎక్కువ శాతం మంది వినియోగిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతుండడంతో వాహన వినియోగదారులు ఈవీ వాహనాలపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. దాంతో రోజురోజుకీ వీటికీ ఉన్న డిమాండ్ క్రేజ్ పెరుగుతూనే ఉంది. వీటి అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి.

అయితే అమ్మకాలు పెరిగినా సగటు ఈవీ కార్ల వినియోగదారులను కొన్ని అనుమానాలు వేధిస్తున్నాయి. అందులో మొదటిది బ్యాటరీ చార్జింగ్. బ్యాటరీ అనేది ఈవీ కారు నడవడానికి ముఖ్యమైన పార్ట్. ఈ బ్యాటరీ విషయంలో చాలామందికి అనేక రకాల సందేహాలు కూడా ఉన్నాయి. వాటిలో బ్యాటరీను వర్షం పడుతున్న సమయంలో ఛార్జ్ చేయవచ్చా అన్న సందేహం కూడా ఒకటి. మరి ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేయడం కష్టం. ముఖ్యంగా వర్షాకాలంలో వాటిని ఛార్జ్ చేయడం మరింత కష్టం అవుతుంది. కానీ కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ కారును సులభంగా ఛార్జ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఏదైనా కంపెనీ తన ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు అనేక దశల్లో టెస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత మాత్రమే కారు మార్కెట్లోకి విడుదల చేస్తారు. వాహన తయారీ దారులు ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జర్లు, కనెక్టర్లను అన్ని రకాల వాతావరణంలో పని చేసేలా తయారు చేస్తారు. దీనితో పాటు, వాటి నాణ్యత కూడా మెరుగ్గా ఉంచుతారు. ఈవీ ఛార్జర్‌ లు, కనెక్టర్‌లు పూర్తిగా వాటర్‌ ప్రూఫ్‌గా ఉంటాయి, దీనితో పాటు, వాటిని దుమ్ము, మట్టి లేదా ఇతర రకాల కణాల నుండి రక్షించడానికి ప్రత్యేక సాంకేతికతను కూడా ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ కార్లలో, ఛార్జర్ వాటర్ ప్రూఫ్‌ తో పాటుగా ఆన్ బోర్డ్ సెన్సార్ల ద్వారా భద్రత కూడా రెట్టింపు అవుతుంది.

అయితే కొన్ని కారణాల వల్ల ఛార్జర్‌ లో సమస్య ఉన్నప్పటికీ అది పరిష్కరించకపోతే కారులో అమర్చిన ఆన్ బోర్డ్ సెన్సార్లు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తాయి. అయితే మీరు మీ కారును ఛార్జ్ చేయాలనుకుంటే డ్రైవింగ్ చేసిన వెంటనే కారును ఛార్జింగ్‌లో ఉంచవద్దని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే డ్రైవింగ్ చేయడం వల్ల బ్యాటరీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఛార్జింగ్‌ లో ఉంచడం వల్ల దాని ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. అలాగే వర్షాకాలంలో, ఛార్జర్‌ పై నేరుగా నీటి చుక్కలు పడని ప్రదేశంలో కారును పార్క్ చేసి ఛార్జ్ చేయడానికి ప్రయత్నించడం మంచిది. కవర్ పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేసిన తర్వాత కారును ఛార్జ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ వర్షాకాలంలో ఈవీ కారును చార్జింగ్ చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి.