Fisker in Hyd: హైదరాబాద్ లో ఫిస్కర్ సెంటర్…300టెక్ నిపుణులకు ఉద్యోగాలు..!!

ప్రపంచ ఎలక్ట్రానిక్ వాహన రంగంలో ప్రముఖ కంపెనీ ఫిస్కర్ హైదరాబాద్ లో ఐటీ, డిజిటల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతుంది. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో...

  • Written By:
  • Updated On - April 13, 2022 / 10:18 AM IST

ప్రపంచ ఎలక్ట్రానిక్ వాహన రంగంలో ప్రముఖ కంపెనీ ఫిస్కర్ హైదరాబాద్ లో ఐటీ, డిజిటల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతుంది. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో…ఈ విషయమై సంప్రదింపులు జరుగుతున్న కంపెనీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. లాస్ ఏంజెల్స్ లోని ఫిస్కర్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈవో హెన్రీక్ ఫిష్కర్, సి.యఫ్ వో గీతా ఫిస్కర్ లతో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానం కానుందని…దీనికి అవసరమైన అన్ని చర్యలను తమ సర్కార్ తీసుకుందని ఫిస్కర్ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ-పాలసీపై చర్చించారు.

హైదరాబాద్ కేంద్రంగా పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయని తెలిపారు. జెడ్ ఎఫ్, హ్యుందయ్ వంటి పలు కంపెనీలు హైదరాబాద్ కేంద్రం తమ టెక్ కార్యకలాపాలను నిర్వహిస్తున్న విషయాన్ని కేటీఆర్ వివరించారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని తెలంగాణ సర్కార్ అత్యంత ప్రాధాన్యత రంగంగా గుర్తించిందని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహన తయారీ పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వారికి తెలిపారు.

ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించిన డిజైన్, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కు హైదరాబాద్ లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. దీనికోసం ప్రత్యేకంగా మొబిలిటీ క్లస్టర్ ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందులోనూ భాగస్వామ్యం కావాలని ఫిస్కర్ కంపెనీని మంత్రి కోరారు. కేటీఆర్ వివరించిన అంశాలు, ప్రాధాన్యతలపై ఫిస్కర్ ప్రతినిధులు సంతృప్తి చెందారు. తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేయనున్న మొబిలిటి క్లస్టర్ లో తాము భాగస్వాములవుతామని వారు అంగీకరించారు. ఐటీ, డిజిటల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ప్రపంచంలో చాలా దేశాలతోపాటు భారత్ లోని ఇతర రాష్ట్రాలను పరిశీలించామని ఫిస్కర్ సభ్యులు తెలిపారు. అయితే తెలంగాణలోని పారిశ్రామిక అనుకూలత ప్రభుత్వ పారదర్శక విధానాలే హైదరాబాద్ లో సెంటర్ ఏర్పాటుకు దోహదం చేశాయని ఆ సంస్థ సీఈవో హెన్రీక్ ఫిష్కర్ తెలిపారు.

ఈ సెంటర్ ఏర్పాటుతో ఆటోమొబైల్, సాఫ్ట్ వేర్ రంగాలకు చెందిన 300 మంది టెక్ నిపుణులకు ఉద్యోగావకాశాలు దొరికే ఛాన్స్ ఉందన్నారు. రానున్న కాలంలో దీన్ని మరింతగా విస్తరించి మరికొంతమంది ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా పరిశోధన, ఇంజనీరింగ్ కార్యకాలపాలకు సంబంధించిన వివరాలను కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ కు అందజేశారు.