మామూలుగా ఒక సంవత్సరం ముగిసి మరొక సంవత్సరం మొదలవుతుంది అంటే చాలు అనేక విషయాలలో కొత్త కొత్త రూల్స్ పాటించాల్సి వస్తూ ఉంటుంది. ఇక కొత్త ఏడాదితో పాటు ధరలు కూడా మండిపోతూ ఉంటాయి. నిత్యం మనం ఉపయోగించే వాటిపై ధరలు పెంచేస్తూ ఇప్పటికే నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అందులో భాగంగానే వచ్చే ఏడాది జనవరి నుంచి బీఎండబ్ల్యూ కార్ల ధరలు కూడా పెరగనున్నాయి. మామూలుగా చాలామందికి బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేయాలి అని ఆశ ఉంటుంది.. కానీ ఈ కారు ధర కారణంగా చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. అలాంటిది వచ్చే ఏడాది నుంచి ఈ కారు ధరను మరింత పెంచనుంది BMW సంస్థ.
మరి ఆ వివరాల్లోకి వెళితే.. జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా BMW ఇండియా వచ్చే ఏడాది నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జనవరి 1 నుంచి బీఎండబ్ల్యూ కార్ల ధరలు రెండు శాతం మేర పెరుగుతాయని ప్రకటనలో పేర్కొంది. విదేశీ మారక ద్రవ్య విలువ పెరగడంతో పాటు, నిర్వహణ వ్యయం అధికం కావడంతో ధరలు పెంచక తప్పడం లేదని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా తెలిపారు. జనవరి 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. భారత్‌లో బీఎండబ్ల్యూ సంస్థ 220ఐ ఎమ్ స్పోర్ట్ నుంచి ఎక్స్‌ఎమ్ వరకు వివిధ రకాల కార్లను విక్రయిస్తోంది.
వీటి ధరల శ్రేణి రూ.43.5 లక్షల నుంచి రూ.2.6 కోట్ల వరకు ఉంది. ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా, హోండా, ఆడీ సంస్థలు ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో బీఎండబ్ల్యూ చేరింది. అయితే ఇప్పటికే కొన్ని కార్ల తయారీ సంస్థలు ఈ ఇయర్ ఎండ్ సేల్స్ లో భాగంగా కార్లపై లక్షల్లో ఆఫర్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. కార్లు కొనుగోలు చేయాలి అనుకున్న వారికి ఇది సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి కార్ల ధరలు చాలా వరకు పెరగనున్నాయి. కాబట్టి ఇయర్ ఎండ్ సేల్స్ లో కొనుగోలు చేసే వారికి కార్లపై లక్షల్లో డిస్కౌంట్ లభిస్తోంది.