Audi మీరు కొత్త కారు కొనుగోల చేయాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే ఇది మీకోసమే. మీరు లగ్జరీ కారు కొనుగోలు చేయాలనుకుంటే, అది కూడా ఆడి కంపెనీ కారు అయితే వెంటనే కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే ఆడి ఇండియా కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. ఏప్రిల్ 1 నుంచే కొత్త ధరలను అమలులోకి తీసుకొస్తోంది. మరి ఒక్కో కారుపై ఎంత పెంచుతుందో తెలుసుకుందాం.
మీరు మంచి లగ్జరీ కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే బిగ్ అలర్ట్. ఆడి (Audi) కారు గనక కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే మీరు వెంటనే కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే జర్మనీకి చెందిన ఈ ప్రముఖ లగ్జరీ కార్ల తాయరీ సంస్థ తమ కంపెనీకి చెందిన కార్ల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. భారత్‌లో విక్రయిస్తున్న అన్ని రకాల మోడళ్లపై ధరల పెంపు ఉంటుందని స్పష్టం చేసింది. పెంచిన ధరలను వచ్చే నెల ఏప్రిల్ 1, 2026 నుంచే అమలులోకి తీసుకొస్తున్నామని తెలిపింది. అంటే మార్చి 31 వరకు పాత ధరలతోనే కొనుగోలు చేయవచ్చు. ఎవరైనా ఆడి కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే వెంటనే కొనడం మంచిది.
ఆడి ఇండియా కంపెనీకి చెందిన అన్ని రకాల మోడళ్లపై 2 శాతం వరకు ధరలు పెంచుతున్నామని, పెరిగిన ధరలను ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసుకొస్తున్నామని ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. దేశంలో పెరుగుతున్న ధరలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పతనమవుతుండడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ముడి సరకు ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోతుండడం కంపెనీపై అదనపు భారాన్ని వేస్తోందని, అందులో కొంత కస్టమర్లకు బదిలీ చేయక తప్పడం లేదని పేర్కొన్నారు.
భారత్‌లో లగ్జరీ కార్లతో పాటుగా ఎస్‌యూవీ కార్లను ఆడి కంపెనీ విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. క్యూ3 ఎస్‌యూవీ నుంచి ఎస్‌యూవీ ఆర్ఎస్ క్యూ8 వరకు కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కార్ల ధరలు రూ.43.23 లక్షల నుంచి రూ.2.34 కోట్లు (ఎక్స్ షోరూమ్ ధర) వరకు ఉన్నాయి. భారత్‌లో ప్రీమియం లగ్జరీ కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇతర కంపెనీలు వివిధ మోడళ్లను భారత మార్కెట్లోకి లాంచ్ చేసినప్పటికీ చాలా మంది ఆడి కార్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతారు. రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖ ఇళ్లల్లో ఆడికి చెందిన కార్లే ఎక్కువగా కనిపిస్తుంటాయి. విలాసవంతమైన కార్ల బ్రాండ్‌లో ఆడికి మంచి ఆదరణ ఉంది. భారత్‌లో ఈ కార్లు కొనుగోలు చేయడం హుందాగా భావిస్తారు.
