Tata Punch Facelift: టాటా పంచ్ భారత మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. బలమైన బిల్డ్ క్వాలిటీ, ఎత్తైన బాడీ స్టైల్, నమ్మకమైన పనితీరు కారణంగా ఈ SUV తక్కువ సమయంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పటివరకు కంపెనీ ఫీచర్లను అప్‌డేట్ చేసినప్పటికీ డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. అందుకే ఇప్పుడు టాటా మోటార్స్ పంచ్‌కు సరికొత్త రూపాన్ని ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా లీక్ అయిన ‘స్పై షాట్స్’ ప్రకారం.. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌కు సిద్ధంగా ఉంది. ఇందులో అనేక కీలక మార్పులు ఉండబోతున్నాయి.
కొత్త డిజైన్- స్టైల్
కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ మునుపటి కంటే చాలా మోడ్రన్‌గా, షార్ప్‌గా ఉండబోతోంది. ముందు భాగంలో బంపర్ కొత్తగా ఉంటుంది. దాని దిగువ భాగంలో ADAS సెన్సార్లు కనిపించాయి. మెయిన్ గ్రిల్‌లో మార్పులు చేశారు. ఇప్పుడు ఇందులో రెండు హారిజాంటల్ ఎయిర్ ఇన్ టేక్ స్లిట్స్ ఉంటాయి. LED DRLలు మరింత పల్చగా మారుతుండగా, హెడ్ లైట్లను వర్టికల్ స్టైల్‌లోకి మార్చారు.
ఎక్స్‌టీరియర్ – పవర్‌ఫుల్ లుక్
సైడ్ ప్రొఫైల్‌లో కొత్త అలాయ్ వీల్స్, మందపాటి డోర్ క్లాడింగ్ ఉంటుంది. ఇది పంచ్ బలమైన SUV రూపాన్ని అలాగే ఉంచుతుంది. స్పై షాట్స్‌లో డ్యూయల్-టోన్ రూఫ్ కూడా కనిపించింది. దీనివల్ల కారు మునుపటి కంటే మరింత ప్రీమియంగా కనిపిస్తోంది. ట్రిమ్ వెర్షన్‌ను బట్టి ఫాగ్ ల్యాంప్స్, కార్నరింగ్ ఫంక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.
Also Read: జనవరి 2026 నుండి మారనున్న 10 కీలక నిబంధనలీవే!
భారీ ఫీచర్ అప్‌గ్రేడ్స్
ఫీచర్ల పరంగా టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ పెద్ద అడుగు వేయబోతోంది. లీక్ అయిన ఫోటోలలో 360-డిగ్రీ కెమెరా స్పష్టంగా కనిపించింది. ఇది బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్ల కోసం ఉపయోగపడుతుంది. ఈ విభాగంలో మొదటిసారిగా లెవల్-2 ADAS వంటి సేఫ్టీ ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది.
ప్రీమియం ఇంటీరియర్
కారు లోపలి భాగంలో కూడా అనేక మార్పులు ఉండవచ్చు. ఇందులో పెద్దదైన 10.2 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండొచ్చు. కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్, రీడిజైన్ చేసిన సెంటర్ కన్సోల్ కేబిన్‌ను మరింత మోడ్రన్‌గా, యూజర్ ఫ్రెండ్లీగా మారుస్తాయి.
ఇంజిన్‌లో మార్పు లేదు
పవర్‌ట్రెయిన్ విషయంలో టాటా ఎటువంటి ప్రయోగాలు చేయడం లేదు. కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతుంది. అలాగే CNG వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో మునుపటిలాగే డ్యూయల్ సిలిండర్ సెటప్ ఉంటుంది. దీనివల్ల బూట్ స్పేస్ (డిక్కీ) ఎక్కువగా లభిస్తుంది.
లాంచ్ ఎప్పుడు?
నివేదికల ప్రకారం.. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ 2026 మొదటి అర్ధభాగంలో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, బలమైన సేఫ్టీ ప్యాకేజీతో ఈ SUV మరోసారి మార్కెట్లో సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది.
