భారత ఆటోమెుబైల్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాలు సందడి చేస్తున్నాయి. ఇదే అదునుగా చాలా కంపెనీలు కొత్త వాహనాలను మార్కెట్‌లోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఏథర్ 450ఎక్స్ కూడా విడుదలైంది. అయితే ఏథర్ 450ఎక్స్, ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్‌లో ఏది బాగుంటుందో, ఈ మూడు రకాల స్కూటర్ లలో ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇకపోతే తాజాగా ఏథర్ ఎనర్జీ తన కొత్త 450 ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 450S, 450X, 450 అపెక్స్ మోడల్స్ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇందులో 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఉన్న పాపులర్ ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ, ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతోంది.
కాగా కొత్త అప్‌గ్రేడ్ చేసిన ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు బ్యాటరీ ఆప్షన్ లో ప్రారంభించారు. 2.9kWh, 3.7kWh. ఇందులో 3.7kWh బ్యాటరీతో ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇతర రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లతో పోల్చవచ్చు. ఎందుకంటే వాటిలో అమర్చిన బ్యాటరీలు చాలా సామర్థ్యం కలిగి ఉంటాయి. 3.7kWh బ్యాటరీ కలిగిన ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1 లక్షా 56 వేల 999. 4kWh కెపాసిటీ బ్యాటరీ కలిగిన ఓలా ఎస్1 ప్రో స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.44 లక్షలుగా ఉంది. 3.4kWh బ్యాటరీ కలిగిన టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.66 లక్షలుగా ఉంది. ఇక లుక్స్ పరంగా, కొత్త ఏథర్ 450ఎక్స్ మిగతా రెండింటికి భిన్నంగా ఉంటుంది. అయితే 2025 450X ఎలక్ట్రిక్ స్కూటర్ పెద్దగా మారలేదు.
కొత్త 450ఎక్స్ మంచి డిజైన్‌లో ఎల్ఈడీ డీఆర్ఎల్ లతో ఎల్ఈడీ హెడ్‌లైట్ లను పొందుతుంది. ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ వక్ర రూపాన్ని కలిగి ఉన్నట్లుగా కనిపిస్తోంది. 2025 ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ 3.7kWh కెపాసిటీ గల బ్యాటరీని కలిగి ఉంది. ఇది పూర్తి ఛార్జ్ తో 156 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఓలా ఎస్1 ప్రో 4kWh బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్ పై 195 కి.మీల రేంజ్ కలిగి ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 3.4kWh బ్యాటరీ 145 కిలో మీటర్ల రేంజ్ అందించగలదు. ఏథర్ 450ఎక్స్ స్కూటర్ బ్యాటరీని 0 నుండి 80శాతం వరకు ఛార్జ్ చేయడానికి 3-3.5 గంటలు పడుతుంది. ఐక్యూబ్ ఎస్టీ స్కూటర్ బ్యాటరీని 80 శాతానికి ఛార్జ్ చేయడానికి దాదాపు 3 గంటలు పడుతుంది. అయితే ఓలా ఎస్1 ప్రో 4kWh బ్యాటరీ 80 శాతానికి ఛార్జ్ చేయడానికి 4.5 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుందట.