Site icon HashtagU Telugu

Zika Virus : ఏపీలో ‘జికా’ కలకలం.. నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు

Zika Virus Case Nellore Andhra Pradesh

Zika Virus : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడిలో జికా వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలను గుర్తించారు. తొలుత ఆ బాలుడిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి ట్రీట్‌మెంట్ అందించారు. జికా లక్షణాలు ఉండటంతో వెంటనే చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆ బాలుడికి(Zika Virus) సోకింది జికా ఇన్ఫెక్షనేనా ? కాదా ? అనేది నిర్ధారించుకునేందుకు అతడి బ్లడ్ శాంపిల్స్‌ను మహారాష్ట్రలోని  పూణేలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. అక్కడి నుంచి నివేదిక వస్తేనే.. బాలుడికి సోకింది జికా ఇన్ఫెక్షనా ? ఇంకేదైనా ఇన్ఫెక్షనా ? అనేది తేలుతుంది.

Also Read :China In Doklam : డోక్లాం శివార్లలో చైనా గ్రామాలు.. భారత్‌లోని సిలిగురి కారిడార్‌కు గండం

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వెంకటాపురంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామం పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించి, రోగ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి తగిన చికిత్స అందించనున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే స్థానిక వైద్య కేంద్రాలకు తెలియజేయాలని గ్రామస్తులకు వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఈనేపథ్యంలో ఏపీ ప్రభుత్వ వైద్యుల బృందం ఇవాళ వెంకటాపురంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.

Also Read :Diabetic Retinopathy : పెరుగుతున్న డయాబెటిక్‌ రెటీనోపతి కేసులు.. ఏమిటీ వ్యాధి ?

జికా లక్షణాలు ఇవీ..

దోమల ద్వారా జికా వైరస్‌ వ్యాపిస్తుంది. ఎడిస్‌ దోమలు కుట్టడం వల్ల ఇది సోకుతుంది. ఇది ప్రాణాంతకం కాదు. అయితే ఈ ఇన్ఫెక్షన్ సోకే మహిళకు పుట్టబోయే పిల్లలు తల చిన్నగా ఉంటుంది. వారికి నాడీ సంబంధిత సమస్యలు వచ్చే ముప్పు ఉంటుంది. వాస్తవానికి జికా వైరస్ కేసులకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు ఈ ఏడాది జూన్‌లోనే కేంద్ర ఆరోగ్యశాఖ అడ్వైజరీని జారీ చేసింది. ముఖ్యంగా గర్భిణులకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించడం, ఒకవేళ జికా ఇన్ఫెక్షన్ పాజిటివ్‌ వస్తే పిండం ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. జికా వైరస్ సోకితే.. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.