Nara Lokesh : నారా లోకేశ్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత.. నేటి నుంచే అమల్లోకి

Nara Lokesh : బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో  నారా లోకేశ్‌కు భద్రతపై కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh Comments Galla Jayadev Goodbye To Politics

Nara Lokesh Comments Galla Jayadev Goodbye To Politics

Nara Lokesh : బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో  నారా లోకేశ్‌కు భద్రతపై కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నారా లోకేశ్‌కు జెడ్‌ కేటగిరీ భద్రతను  కల్పిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.  సీఆర్‌పీఎఫ్‌ (వీఐపీ వింగ్‌) బలగాలతో భద్రత కల్పిస్తామని ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఆదివారం నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని, లోకేశ్‌ భద్రత కోసం 10 మంది సాయుధ సీఆర్పీఎఫ్ కమాండోలు ఉంటారని తెలిపింది. ఈరోజు 33 మంది కేంద్ర సిబ్బంది ఆయుధాలతో లోకేశ్‌ ఇంటికి చేరుకోనున్నారు. శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి ఏపీ ప్రభుత్వానికి, లోకేశ్‌కు ఈ మేరకు సమాచారం అందింది. 2016 అక్టోబరులో ఆంధ్రా-ఒడిశా బార్డర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత అప్పటి ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని నాటి ఏపీ సెక్యూరిటీ రివ్యూ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.అయితే ఆ తర్వాత వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో లోకేశ్‌కు భద్రతను తగ్గించింది.  టీడీపీ హయాంలో ఏపీ సెక్యూరిటీ రివ్యూ కమిటీ చేసిన సిఫార్సులను జగన్ సర్కారు పక్కన పెట్టింది. లోకేశ్‌కు  వై కేటగిరీ భద్రత మాత్రమే కల్పిస్తూ వచ్చింది.

We’re now on WhatsApp. Click to Join

మరోవైపు  తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్‌కు లోకేశ్‌ భద్రతా సిబ్బంది 14 సార్లు లేఖలు రాశారు.  లోకేశ్‌కు జగన్ ప్రభుత్వం తగిన భద్రత కల్పించడం లేదంటూ అనేక సార్లు కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లారు. యువగళం పాదయాత్రలో లోకేశ్‌ లక్ష్యంగా జరిగిన దాడులను కూడా కేంద్రానికి వివరించారు. గతంలో మావోయిస్టు హెచ్చరికలు, భద్రతా పరంగా ఉన్న నిఘా వర్గాల సమాచారాన్ని కూడా పరిశీలించిన కేంద్రం.. ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో లోకేశ్‌కు(Nara Lokesh) జెడ్‌ కేటగిరీ భద్రతను కల్పించింది.

Also Read :TDP – Social Equations : టీడీపీ సగానికిపైగా అసెంబ్లీ సీట్లు మూడు వర్గాలకే! 

జెడ్‌ కేటగిరీ భద్రత అంటే ?

దేశంలో అత్యంత ముప్పు ఎదుర్కొంటున్న వారికి కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. ఇంటెలీజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) సమాచారం ఆధారంగా ఎవరెవరికీ ఏ స్థాయి భద్రత కల్పించాలనేది హోం వ్యవహారాల శాఖ నిర్ణయిస్తుంది.  జెడ్‌ కేటగిరిలో ఆరుగురు గన్‌మెన్‌లు, ఇంటి వద్ద కాపలాకు మరో ఇద్దరిని ( ప్లస్ 8) పెడతారు.  ఎక్స్‌ కేటగిరి రక్షణ ఉన్నవారికి ఒక గన్‌మ్యాన్‌ని మాత్రమే కేటాయిస్తారు.  వై కేటగిరి కింద ఒక గన్‌మ్యాన్, స్టాటిక్ సెక్యూరిటీ కోసం ఒకరు (ప్లస్ ఫోర్ రొటేషన్‌లో) ఉంటారు. వై-ప్లస్ సెక్యూరిటీ కలిగిన వారికి ఇద్దరు గన్‌మెన్‌లు (ప్లస్ నలుగురు రొటేషన్‌లో), నివాస భద్రత కోసం ఒకరు (ప్లస్ నలుగురు రొటేషన్) ఉంటారు.

  Last Updated: 31 Mar 2024, 09:02 AM IST