Site icon HashtagU Telugu

Yuvagalam : కృష్ణాజిల్లాలో లోకేష్ “యువ‌గ‌ళం” స‌క్సెస్ అయ్యేనా..?

Yuvagalam

Lokesh Yuva Galam

యువ‌గ‌ళం పాద‌యాత్ర మ‌రో రెండు రోజుల్లో కృష్ణాజిల్లాకు చేరుకోబోతుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని జిల్లాలో సక్సెస్‌గా సాగిన పాద‌యాత్ర.. కృష్ణాజిల్లాలో ఎంత‌వ‌ర‌కు విజ‌య‌వంతం అవుతందో అనేది ప్ర‌శ్న‌గా మారింది. దీనికి కార‌ణం నాయ‌కులు మ‌ధ్య తీవ్ర వ‌ర్గ‌పోరు మాత్ర‌మే… రాజ‌కీయ చైత‌న్యం క‌లిగిన ఈ జిల్లాలో బ‌డా రాజ‌కీయ నేత‌లు ఉన్నారు. ఉమ్మ‌డి కృష్ణాజిల్లా టీడీపీకి కంచుకోట‌గా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం కంచుకోట‌ను వైసీపీ బ‌ద్ద‌లు కొట్టింది. ఇక్క‌డ వైసీపీ గెల‌వ‌డానికి కూడా టీడీపీలోని అంత‌ర్గ‌త వ‌ర్గ‌పోరేన‌ని క్యాడ‌ర్‌లో చ‌ర్చ జ‌రుగుతుంది.

అధికారం కోల్పోయిన స‌రే బెజ‌వాడ టీడీపీ నేత‌ల్లో మార్పు రావ‌డంలేదు. ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్యం చేలాయించుకుంటూ వ‌ర్గాలుగా విడిపోయారు. పార్టీని పూర్తిస్థాయిలో డ్యామేజ్ చేస్తున్నారు. విజ‌య‌వాడ న‌గ‌రంలో బుద్దా వెంక‌న్న‌, బోండా ఉమా, నాగుల్ మీరాలు ఒక వ‌ర్గంగా… ఎంపీ కేశినేని నాని ఒక వ‌ర్గంగా ఉన్నారు. వీరికి తోడు జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు కూడా చేయి క‌లిపారు. గ‌త రెండు ద‌శాబ్ధాలుగా జిల్లాలో ఆధిప‌త్యం చేలాయిస్తున్న దేవినేని ఉమాకి సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే సొంత పార్టీ నేత‌ల నుంచి వ్య‌తిరేక‌త మొద‌ల‌యింది. మైల‌వ‌రంలో ఉమా పోటీ చేస్తే ఓడిస్తామంటూ పార్టీ నాయ‌క‌లు బ‌హిరంగంగానే చెప్తున్నారు. న‌మ్మిన వాళ్ల‌ని న‌ట్టేటా ముంచ‌డంలో ఉమా త‌రువాతే అని నాయ‌కులు చెవులు కోరుక్కుంటున్నారు. త‌న అన్న ర‌మ‌ణ వెంట ఉన్న వాళ్లంతా ఆయ‌న మ‌ర‌ణానంత‌రం ఉమా వెంట న‌డిచారు. వీరంద‌రిని ఉమా ప‌ట్టించుకోకుండా వారిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని క్యాడ‌ర్‌లో వినిపిస్తుంది.

తాజాగా నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర జిల్లాలో ఎలా జ‌రుగుతుంద‌నే సందేహం అంద‌రిలో ఉంది. ఇప్ప‌టికే వ‌ర్గాలుగా విడిపోయిన తెలుగు త‌మ్ముళ్లు లోకేష్ యాత్ర‌కు స‌హ‌క‌రిస్తారా లేదా అనేది చ‌ర్చ జ‌రుగుతుంది. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ఫ్లెక్సీల విష‌యంలో టీడీపీ నేత‌లు త‌న్న‌కుని కేసులు కూడా పెట్టుకున్నారు. మ‌రోవైపు పాద‌యాత్ర బాధ్య‌త‌ల‌ను జిల్లా అధ్య‌క్షుల‌ని కాద‌ని కేశినేని చిన్నికి అప్ప‌గించిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. ఇటు ఎంపీ కేశినేని నాని కూడా యాత్ర‌లో పాల్గొంటారా లేదా అనేది ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. చిన్నికి ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో కేశినేని నాని వ‌ర్గం పాద‌యాత్ర‌కు స‌హ‌క‌రించే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. జిల్లాలో 15 రోజుల పాటు సాగాల్సిన యాత్ర‌..5 రోజుల‌కే కుదించ‌డానికి వ‌ర్గ‌పోరే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. మ‌రి ఉమ్మ‌డి కృష్ణాజిల్లా నేత‌లు యువ‌గళం పాద‌యాత్ర‌ను ఎలా స‌క్సెస్ చేస్తారో వేచి చూడాలి.