టీడీపీ(TDP) యువతనేత నారా లోకేశ్(Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లా అయిన కడపలో నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేఖ విధానాలను కొనసాగిస్తుందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో భాగంగా అన్ని వర్గాల ప్రజలతో లోకేశ్ భేటీ అవుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. లోకేశ్ పాదయాత్ర టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపుతుంది. ముఖ్యంగా యువతకు అన్ని విధాల అండగా ఉంటానని లోకేశ్ హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు పలు దేశాల్లోని టీడీపీ అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో లండన్(London)లోనూ యువగళం పాదయాత్ర జెండాలు రెపరెపలాడాయి. భారత్ , ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్‌లోని ఓవల్ స్టేడియంలో వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ సమరం జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 3గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భాతర్ జట్టు తొలుత ఫీల్డింగ్ తీసుకుంది. అయితే, ఈ మ్యాచ్ జరుగుతున్న ఓవల్ స్టేడియంలో బ్రిటన్ టీడీపీ ఎన్నారై సభ్యులు యువగళం జెండాలు చేతబూని ఏపీలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్ కు మద్దతు తెలిపారు.
స్టేడియంలో యువగళం జెండాలను ప్రదర్శిస్తూ జై లోకేశ్, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలను చూసిన తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందిస్తున్నారు.
Also Read : WTC Final 2023: భారత్ బౌలర్ల ధాటికి కంగారు పడుతున్న కంగార్లు