Site icon HashtagU Telugu

YSRCP Boycott : అసెంబ్లీకి వచ్చేదేలే అంటున్న జగన్

Jagan Reddy

Jagan Reddy

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చర్చనీయాంశంగా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSP) అధినేత వైఎస్ జగన్ (Jagan) అసెంబ్లీ బహిష్కరణ. తన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, మైక్ అవకాశం ఇవ్వడంలేదని కారణాలు చెబుతూ ఇకపై అసెంబ్లీకి హాజరుకావడం మానేస్తానని ప్రకటించారు. కానీ ప్రజా ప్రతినిధులుగా వారు ప్రజల సమస్యలను సభలో లేవనెట్టి పరిష్కారం కోరడం ప్రధాన బాధ్యత. చట్టసభలను పట్టించుకోకుండా, వీటిని బహిష్కరించడం ప్రజాస్వామ్యానికి తగిన వైఖరి కాదనే విమర్శలు వస్తున్నాయి.

BRS MLAs Disqualification : ఆ ఇద్దరు తప్ప మిగతా వాళ్లంతా బిఆర్ఎస్ వైపే

చట్టపరంగా చూస్తే.. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గ ప్రజల సమస్యలను శాసనసభలో లేవనెత్తాలి. ఆర్టికల్ 190(4) ప్రకారం ఒక ఎమ్మెల్యే 60 రోజులు అనుమతి లేకుండా గైర్హాజరైతే, ఆయన సీటు ఖాళీ అవ్వొచ్చు. ఆ సందర్భంలో ఉప ఎన్నికలు తప్పవు. అయినప్పటికీ, ఇప్పటివరకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అన్నది స్పీకర్ అధికార పరిధిలోనే ఉన్నప్పటికీ, చట్టసభలను పూర్తిగా బహిష్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నిపుణులు అంటున్నారు.

ఇక మరోవైపు, ప్రభుత్వం కూడా ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వడంలో వెనుకబడి ఉందనే విమర్శలు ఉన్నాయి. వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చి ఉండొచ్చు కానీ ఓట్లు 40 శాతం దాకా సాధించింది. ప్రజలలో గణనీయమైన మద్దతు ఉన్న పార్టీకి విలువ ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి అనుకూలం కాదని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది. ప్రతిపక్షాన్ని చిన్నచూపు చూడడం లేదా పక్కన పెట్టడం వల్ల పాలనలో తప్పులు జరిగే అవకాశముందని, అది చివరికి ఎన్నికల్లో ప్రజల అసంతృప్తి రూపంలో బయటపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.