ప్ర‌భుత్వం వైపే స్థానిక ఫ‌లితాలు సాధార‌ణ ఎన్నిక‌ల‌కు గీటురాయి కాదు..!

  • Written By:
  • Publish Date - September 20, 2021 / 02:06 PM IST

స్థానిక ఎన్నిక‌ల బ‌లాన్ని చూసి వైసీపీ సంబ‌ర‌ప‌డుతోంది. జ‌డ్సీటీసీ,ఎంపీటీసీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో హ‌వాను ఆ పార్టీ నిలుపుకుంది. సుమారు 90 శాతం మండ‌ల ప‌రిష‌త్ ల‌ను, 99శాతం జిల్లా ప‌రిష‌త్ ల‌ను కైవ‌సం చేసుకుంది. ఇటీవ‌ల జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ 75గాను 74 మున్సిప‌ల్, న‌గ‌ర పంచాయ‌తీను గెలుచుకుంది. ఒక్క తాడిప‌త్రి మిన‌హా అన్ని కార్పొరేష‌న్ల‌లోనూ ఫ్యాన్ గాలి వీచింది.
కుప్పం స‌హా అన్ని చోట్లా వైసీపీ తిరుగులేని మెజార్టీల‌ను సాధించింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల‌,మంగ‌ళ‌గిరి ప్రాంతాల్లో మిన‌హా మిగిలిన చోట్ల జ‌గ‌న్ పార్టీ విజ‌య‌దుందుభి మోగించింది. కేవ‌లం 23 ఏళ్ల అశ్విన్ ఎంపీటీసీగా గెల‌వ‌డం వైసీపీకి వెయ్యి ఏనుగుల బ‌లాన్ని ఇచ్చింది. చంద్ర‌బాబు కోట‌ను కూల్చామ‌ని భావిస్తుంది. వాస్త‌వంగా తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించింది. నామినేష‌న్లు వేయ‌డానికి అభ్య‌ర్థుల‌ను రానివ్వ‌లేద‌ని వైసీపీ మీద కోపంతో బ‌హిష్క‌ర‌ణ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుత ఫ‌లితాలను తెలుగుదేశం పార్టీ పెద్ద గా ప‌రిణ‌న‌లోకి తీసుకోవ‌డంలేదు.

సాధార‌ణంగా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా స్థానిక ఫ‌లితాలు ఉంటాయి. దేశ వ్యాప్తంగా అనేక ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ స్థానిక ఎన్నిక‌ల‌ను బహిష్క‌రించిన పార్టీలుగా టీఆర్ఎస్, వైసీపీల‌కు గుర్తింపు ఉంది. తాజాగా తెలుగుదేశం పార్టీ ఆ జాబితాలో చేరింది. గ‌తంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌కు టీఆర్ ఎస్ పార్టీ దూరంగా ఉంది. అంతేకాదు, స్థానిక ఎన్నిక‌ల‌కు కూడా దూరంగా చాలా కాలం పాటు ఉంది. ఇక 2013లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల‌కు వైసీపీ దూరంగా ఉంది. ఆ త‌రువాత జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో మాత్రమే పాల్గొంది. ఉప ఎన్నిక‌లు, స్థానిక ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్న పార్టీలు అనేకం. ఢిల్లీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో హ‌వాను సృష్టించిన బీజేపీ సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఢిలా ప‌డింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోనూ అలాంటి ప‌రిస్థితినే మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ప్ర‌తి చోటా స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉండ‌డం స‌హ‌జం.

స్థానిక ఎన్నిక‌ల్లో హ‌వా కొన‌సాగించినంత మాత్ర‌న పార్టీ బ‌లంగా ఉంద‌ని, ప్ర‌భుత్వం వైపు ప్ర‌జ‌లు ఉన్నారని భావించడం ప‌ప్పులో కాలేసిన‌ట్టే. స్థానిక ఫ‌లితాల‌కు విరుద్ధంగా సాధార‌ణ ఎన్నిక‌ల్లో గెలుపును సాధించిన దాఖ‌లాలు తెలుగు రాష్ట్రాల‌లో అనేకం ఉన్నాయి. కాబ‌ట్టి,వైసీపీ బ‌లంగా ఏపీలో ఉంద‌ని భావించ‌డానికి జ‌డ్పీటీడీపీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల ఫ‌లితాలు మైలు రాయి కాద‌ని భావించొచ్చు. పైగా ప‌లు అవ‌క‌త‌క‌ల నేప‌థ్యంలో జ‌రిగిన ఎన్నిక‌లుగా విప‌క్షాలు, కోర్డులు భావిస్తున్నాయి. సో..ఈ ఫ‌లితాల‌తో జ‌గ‌న్ స‌ర్కార్ సంబ‌ర‌ప‌డితే, భ‌విష్య‌త్ లో బోల్తా ప‌డుతుంద‌ని గ్ర‌హించాలి.