AP Politics : వైసీపీలో `మిలేంగే` క‌ల‌వ‌రం!

`మిలేంగే..` అంటూ మోడీ, చంద్ర‌బాబు మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌గా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వివ‌రిస్తూ ట్వీట్ చేశారు. ఆ వెంట‌నే ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉన్న సజ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి స్పందించారు. చంద్ర‌బాబు, మోడీ కల‌వ‌డాన్ని ఎల్లో మీడియా హైలెట్ చేస్తుంద‌ని, మూడు పార్టీలు క‌లిసి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఒంటిరిగా వైసీపీ వ‌స్తుంద‌ని అన్నారు.

  • Written By:
  • Publish Date - August 9, 2022 / 12:20 PM IST

`మిలేంగే..` అంటూ మోడీ, చంద్ర‌బాబు మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌గా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వివ‌రిస్తూ ట్వీట్ చేశారు. ఆ వెంట‌నే ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉన్న సజ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి స్పందించారు. చంద్ర‌బాబు, మోడీ కల‌వ‌డాన్ని ఎల్లో మీడియా హైలెట్ చేస్తుంద‌ని, మూడు పార్టీలు క‌లిసి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఒంటిరిగా వైసీపీ వ‌స్తుంద‌ని అన్నారు. చంద్ర‌బాబుతో బ్రేక్ ఫాస్ట్ చేసిన మోడీ, వైసీపీ చీఫ్ జ‌గ‌న్ తో డిన్న‌ర్ చేశార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టుల‌ను పెడుతున్నారు. అంటే, ఒక‌సారి చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లీ మోడీని క‌లిస్తే వైసీపీ హైరానా ప‌డుతుంద‌ని అర్థం అవుతోంది.

ప్ర‌స్తుతం క్విడ్ ప్రో కో ప‌ద్ద‌తిన బీజేపీ, వైసీపీ మ‌ధ్య సంబంధాలు కొన‌సాగుతున్నాయి. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల వ‌ర‌కు ఆ రెండు పార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త బాగా ఉంది. ఒప్పుడైతే, ముర్ము విజ‌య‌వాడ కేంద్రంగా టీడీపీ ఎమ్మెల్యేల‌తో భేటీ అయ్యారో, ఆ రోజు నుంచి కంటిగింపు వైసీపీకి క‌లిగింది. పైగా చంద్ర‌బాబునాయుడుకు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్లో జ‌రిగిన వేడుక‌ల‌కు ఆహ్వానం ల‌భించ‌డం ఆ జ‌గ‌న్ సీరియ‌స్ గానే తీసుకున్న‌ట్టు ఉన్నారు. బ‌హుశా అందుకేనేమో, ఆ వేడుక‌ల‌కు సీఎం జ‌గ‌న్ దూరం జ‌రిగారు. ఢిల్లీ వెళ్లి కూడా ఆయ‌న ప్రైవేటు ఫంక్ష‌న్ల‌కు వెళ్లారు. ఆ త‌రువాత డిన్న‌ర్ కు మాత్ర‌మే మోడీతో క‌లిసి కూర్చొన్న ఫోటోల‌ను చూశాం.

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు ఆప‌రేష‌న్ ఎప్పుడూ సైలెంట్ గా ఉంటుంది. ఆయ‌నకు తొలి నుంచి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ తో స‌త్సంబంధాలు ఉన్నాయి. రాజ‌కీయంగా బీజేపీ దూరం అయిన‌ప్ప‌టికీ ఆర్ఎస్ఎస్ వ‌ర్గాల‌తో బాబు బంధం బ‌లంగానే ఉంది. అంతేకాదు, న‌డ్డా, అమిత్ షాల‌తోనూ ట‌చ్ లో ఉన్నారు. ఒక్క మోడీ మిన‌హా మిగిలిన లీడ‌ర్లతో చంద్ర‌బాబు మొద‌టి నుంచి సంబంధాల‌ను క‌లిగి ఉన్నారు. 2018 నుంచి మోడీతో మాత్రమే దూరం అయ్యారు. ఇప్పుడు వాళ్లిద్ద‌రి మ‌ధ్యా సఖ్య‌త నెల‌కొంది.

ఫ‌క్తు రాజ‌కీయానుల మోడీ, అమిత్ షా న‌డుపుతారు. ఇంత‌కాలం దూరంగా ఉన్న చంద్ర‌బాబును ఇప్పుడు ద‌గ్గ‌ర‌కు తీసుకుంటున్నార‌ని అర్థం అవుతోంది. దాని వెనుక వాళ్ల వ్యూహం ప‌గ‌డ్బందీగా ఉంద‌ని తెలుస్తోంది. తెలంగాణ‌లో అధికారంలోకి రావాలంటే తెలుగుదేశం పార్టీ అండ కావాల‌ని కోరుకుంటున్నార‌ని స‌మాచారం. ఏపీలో డైరెక్ట్ గా పొత్తు పెట్టుకుని, తెలంగాణ‌లో మాత్రం ప‌రోక్షంగా చంద్ర‌బాబును వాడుకోవాల‌ని స్కెచ్ వేసిన‌ట్టు తెలుస్తోంది. అందుకోసం గ్రౌండ్ ను త‌యారు చేశార‌ట‌. అందుకే, మోడీ ప్ర‌త్యేకంగా చంద్ర‌బాబుతో 5నిమిషాల పాటు మాట్లాడార‌ని బీజేపీ వ‌ర్గాల్లోని టాక్‌.

తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిన లీడ‌ర్లు, క్యాడ‌ర్ తో టీఆర్ఎస్ పార్టీ బ‌లంగా ఉంది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే టీడీపీ మ‌రోరూపం టీఆర్ఎస్ గా క‌నిపిస్తోంది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన బీజేపీ చంద్ర‌బాబు ద్వారా పూర్వ‌పు టీడీపీ క్యాడ‌ర్,లీడ‌ర్ల మీద ఆప‌రేష‌న్ కొన‌సాగించాల‌ని మాస్ట‌ర్ స్కెచ్ వేసింద‌ట‌. అంతేకాదు, చంద్ర‌బాబు శిష్యునిగా పేరున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హ‌వాను దెబ్బ‌తీయాలంటే టీడీపీ మ‌ద్ధ‌తు బీజేపీకి అవ‌స‌రం. క‌నీసం 40 స్థానాల్లో టీడీపీ ప్ర‌భావం గెలుపుఓట‌ముల‌ను నిర్దేశిస్తుంద‌ని బీజేపీ తాజాగా చేసుకున్న స‌ర్వేల్లో వెల్ల‌డి అయింద‌ని టాక్‌. అందుకే, చంద్ర‌బాబు ను 2023 ఎన్నిక‌ల‌కు ఉప‌యోగించుకోవాల‌ని మోడీ, షా ద్వ‌యం ప్లాన్ చేస్తుంద‌ని తెలుస్తోంది. ఆ త‌రువాత 2024 నాటికి డైరెక్ట్ పొత్తుకు వెళ్లే యోచ‌న కూడా ఉంద‌ని ఏపీలో జ‌రుగుతోన్న ప్ర‌చారం.

ఒక వేళ ఎన్డీయేకి 2024లో ఎంపీ సంఖ్య అవ‌స‌రం అయితే, చంద్ర‌బాబు లాబీయింగ్ ద్వారా స‌మ‌కూర్చుకోవ‌చ్చ‌ని కూడా ఆలోచిస్తున్నార‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లోని మాట‌లు. ఇలా ప‌లు ర‌కాలుగా ఆలోచించిన త‌రువాత ఆర్ఎస్ఎస్ ఇచ్చిన స‌ల‌హా మేర‌కు మోడీ, చంద్ర‌బాబు ఏకాంతానికి దారితీసింద‌ట‌. ఇవ‌న్నీ తెలుసున్న వైసీపీ వాళ్లిద్ద‌రి క‌లయిక త‌రువాత క‌ల‌వ‌ర‌ప‌డుతోంది. పైగా సాయిరెడ్డి ట్వీట్ చేసిన `మిలేంగే` మాట కార్యాచ‌ర‌ణ‌కు వ‌స్తే, ఫ్యాన్ రెక్క‌లు విర‌గ‌డం ఖాయ‌మ‌ని టీడీపీ అంచ‌నా వేస్తోంది.