Site icon HashtagU Telugu

Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ కు డాక్టరేట్.. ఏ యూనివర్సిటీ నుంచో తెలుసా?

Duvvada Srinivas

Duvvada Srinivas

ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్‌లో అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీదుగా శ్రీనివాస్‌ గౌరవ డాక్టరేట్‌ను పొందినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్‌ డాక్టరేట్ పొందిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

శ్రీనివాస్‌ తన వృత్తి పట్ల అంకితభావం, సమాజానికి చేసిన విశిష్ట సేవలను గుర్తించి డే స్ప్రింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసినట్లు సమాచారం. గౌరవ డాక్టరేట్ పొందిన దువ్వాడ శ్రీనివాస్‌కి వైసీపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ కార్యక్రమానికి ఇండో-ఇజ్రాయిల్ ఫ్రెండ్ షిప్ అసోసియేషన్ (IIFA) జాతీయ చైర్మన్ డా. ఆడమ్ రాజ్ డెక్కపాటి, రెవరెండ్ సొల్మన్ గట్టు, మణిపూర్ బిషప్ పోతన్, మాజీ ఎంపీ హర్షకుమార్, మున్సిపల్ చైర్మన్ సరస్వతి, దివ్వెల మాధురి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అశోక్ గౌడ్, రాజయ్య గౌడ్, పల్లె వెంకట్ గౌడ్, శంకర్ గౌడ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.

Duvvada Srinivas Doctorate

ఈ సందర్భంగా నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. సొంత భార్యా, పిల్లల మీద కేసు పెట్టి, దివ్వెల మాధురితో కలిసి రీల్స్ చేస్తున్న దువ్వాడకు డాక్టరేట్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందంటూ ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. డాక్టరేట్ పొందిన వారిని చూస్తే ఎంతో గర్వంగా ఉండేదని, వారితో మాట్లాడాలంటే ఎంతో భయం వేసేదని ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు.

దీనిపై ప్రముఖ జర్నలిస్ట్ కందుల రమేశ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ, ‘‘తాజాగా తాను ఒక వార్తను చూశానని, దీనిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు డే స్ప్రింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసినట్లు తెలిసిందన్నారు. రీల్స్ కాకుండా, ఆయన సమాజానికి చేసిన విశిష్ట సేవలు ఏంటి? అని ప్రశ్నించారు. అవార్డ్ అందిస్తున్న డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ క్రిస్టియన్ మతప్రచారకుడని, అతడికి అందిన సమాచారం ప్రకారం చెప్పారు. 2016 ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు పలికినట్లు కూడా తెలిపారు. అయితే, ట్రంప్ సలహాదారుడు కాదని వివరణ ఇచ్చారు. అవార్డు ప్రదానం చేసిన యూనివర్సిటీ అటానమస్ ప్రైవేట్ ఆన్‌లైన్ యూనివర్సిటీ అని, ఇది డూబియస్ యూనివర్సిటీ అని, బైబిల్ స్టడీని చెప్పే యూనివర్సిటీ అని తెలిపారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇక్కడ డబ్బులు ఇచ్చి డాక్టరేట్లు తీసుకుంటారని’’ అన్నారు.

ఆ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ తీసుకున్న ప్రముఖులు ఎవరెవరంటే… కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, తెలంగాణ బీఆర్ఎస్ నాయకుడు వి. శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి తానేటి వనిత, భారతీయ చలనచిత్ర నిర్మాత, జర్నలిస్ట్ సందీప్ మార్వా, రచయిత సద్గురు రితేశ్వర్ జీ మహారాజ్‌తో పాటు మరికొంతమంది ప్రముఖులు ఉన్నారు. మొత్తం లిస్ట్ కోసం ఈ లింక్ ( https://dayspringuniversity.com/honorary-doctorate.php ) క్లిక్ చేయండి.