Site icon HashtagU Telugu

KCR Harish Rao : టీఆర్ఎస్ లో చీలిక‌పై వైసీపీ డౌట్స్ !

Kcr Harish Sajjala

Kcr Harish Sajjala

`గులాబీ గ్రూప్ లో తేడా వ‌స్తే వ‌చ్చి ఉండొచ్చు. అందుకే, ఏపీ టీడీపీ గ్యాంగ్ తో హ‌రీశ్ క‌లిసిన‌ట్టు ఉన్నారు` అంటూ ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి టీఆర్ఎస్ లో అనుమానాల‌ను రేకెత్తించారు. `మామ, అల్లుడు మ‌ధ్య తేడా వ‌స్తే తెలంగాణాలో చూసుకోవాలిగానీ, ఏపీ టీచ‌ర్ల సంగ‌తి ఎందుకు` అంటూ మంత్రి అమ‌ర్నాథ్ టీఆర్ఎస్ పార్టీలోని చీలిక గురించి ప‌రోక్షంగా ఆస‌క్తిక‌ర అంశాన్ని లేవ‌నెత్తారు. అటు స‌జ్జ‌ల ఇటు మంత్రి అమ‌ర్నాథ్ రేకెత్తించిన అనుమానాలు టీఆర్ఎస్ పార్టీలోని అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌ను ప్ర‌శ్నించేలా ఉన్నాయి.

ప్ర‌గ‌తి భ‌వ‌న్లో ఏదో జ‌రుగుతుంద‌ని రెండు రోజుల క్రితం ఆంగ్ల ప‌త్రిక క‌థ‌నాన్ని రాసింది. రాజ్య‌స‌భ ఎంపీ సంతోష్ ను ప్ర‌గ‌తిభ‌వ‌న్ నుంచి గెంటేశార‌ని ఆ క‌థ‌నంలోని సారాంశం. దానికి ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చిన‌ప్ప‌టికీ ప‌లు ర‌కాల ప్ర‌చారాలు మాత్రం ఆగ‌లేదు. ఇక టీఆర్ఎస్ పార్టీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నార‌ని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ చెబుతున్నారు. ఏ రోజైనా కేసీఆర్ జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మంటూ ఊద‌ర‌గొడుతున్నారు. అందుకు బ‌లంచేకూరేలా ఇటీవ‌ల ఈడీ దాడులు ఉధృతంగా జ‌రిగాయి. క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి స‌న్నిహితంగా ఉండే కంపెనీల మీద ఈడీ దాడులు చేసింది. ఇంకేముంది క‌విత దొర‌కిందంటూ బీజేపీ ప్ర‌చారం చేసింది. సీన్ క‌ట్ చేస్తే, మిష‌న్ భ‌గీర‌థ‌, లా అండ్ ఆర్డ‌ర్ అంశాల‌తో పాటు ప‌లు అవార్డుల‌ను కేంద్రం నుంచి తెలంగాణ ప్ర‌భుత్వం పొందింది. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ రాజ‌కీయ గేమ్ ఆడుతున్నాయ‌ని కాంగ్రెస్ భావిస్తోంది.

ప్ర‌గ‌తి భ‌వ‌న్, ఫాంహౌస్ కేంద్రంగా జ‌రిగే ప‌రిణామాల‌పై ప‌లు విధాలుగా ప్రచారం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ కేసీఆర్ మాత్రం అక్టోబ‌ర్ 5వ తేదీన జాతీయ పార్టీని ప్ర‌క‌టించ‌బోతున్నారు. టీఆర్ఎస్ పార్టీని పెట్ట‌బోయే జాతీయ పార్టీలో విలీనం చేయ‌డానికి ఎన్నికల క‌మిష‌న్ తో పాటు చ‌ట్ట‌బద్ధ‌మైన అంశాల‌పై అధ్య‌య‌నం చేశార‌ని తెలుస్తోంది. జాతీయ పార్టీ రూపంలో ఏపీలోకి అడుగు పెట్ట‌డానికి కేసీఆర్ సిద్ధం అవుతున్నారు. మ‌హా కూట‌మిని ఏర్పాటు చేయ‌డం ద్వారా ఏపీలోని రాజ‌కీయ శూన్య‌త‌ను భ‌ర్తీ చేయాల‌ని పీకే ఇచ్చిన స‌ల‌హాల‌ను కేసీఆర్ పాటిస్తార‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలో మంత్రి హ‌రీశ్ రావు ఏపీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తూ టీచ‌ర్లు, ఉద్యోగులకు మ‌ద్ధ‌తుగా మాట్లాడారు. ఇదే వాయిస్ ను టీడీపీ కొంత కాలంగా వినిపిస్తోంది. దాన్నే హ‌రీశ్ రావు కూడా వినిపించ‌డంతో టీఆర్ఎస్ లో చీలిక అంశం మ‌రోసారి చ‌ర్చ‌ల్లోకి వ‌స్తోంది.

2014 ఎన్నిక‌ల్లో బొటాబొటి మెజార్టీతో ప్ర‌భుత్వాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఆ స‌మ‌యంలో ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దానికి రుజువుగా ఓటుకు నోటు కేసును టీఆర్ఎస్ చూపిస్తోంది. ఆ స‌మ‌యంలో హ‌రీశ్ రావుతో టీడీపీలోని ఒక గ్యాంగ్ మంత‌నాలు చేసింద‌ని అప్ప‌ట్లో టాక్ న‌డిచింది. అంతేకాదు, 2009 ఎన్నిక‌ల త‌రువాత కూడా స్వ‌ర్గీయ వైఎస్ ఆర్ చేసిన ఆప‌రేష‌న్ ఆకర్ష్ కు హ‌రీశ్ రావు ద‌గ్గ‌ర‌య్యార‌ని అప్ప‌ట్లో కాంగ్రెస్ వ‌ర్గాల్లో బాగా ఇష్యూ న‌లిగింది. రెండోసారి సీఎంగా కేసీఆర్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత మంత్రి ప‌ద‌విని ఇవ్వ‌కుండా కొంత కాలం హ‌రీశ్ రావును దూరంగా పెట్టారు. ఆ స‌మ‌యంలోనూ పలు ర‌కాల అనుమానాలు ఆయ‌న చుట్టూ వ‌చ్చాయి.

బెంగుళూరు కేంద్రంగా హ‌రీశ్ రావు, ప్ర‌స్తుతం బీజేపీ ఎమ్మెల్మేగా ఉన్న ఈటెల రాజేంద్ర కొంద‌రు ఎమ్మెల్యేల‌తో క‌లిసి కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ విష‌యాన్ని టీఆర్ఎస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఈటెల ప‌లు సంద‌ర్బాల్లో హ‌రీశ్ రావును ఎక్కుపెడుతూ మాట్లాడారు. ప‌లు సంద‌ర్బాల్లో బీజేపీ కూడా కేసీఆర్ ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని చెప్పారు. ఇలాంటి ప్ర‌చారాల‌కు ఇప్పుడు ఏపీ మంత్రులు, స‌ల‌హాదారులు చెబుతోన్న మాట‌ల‌ను జోడిస్తే మంత్రి హ‌రీశ్ రావు టీడీపీ గ్యాంగ్ తో చేతులు క‌లిపి కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని పడ‌గొట్ట‌బోతున్నారా? అనే అనుమానాల‌కు తావిస్తోంది.