Balineni Srinivas Reddy : మాజీ మంత్రి `బాలినేని` రాజ‌కీయం భ‌లేభ‌లే!

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి అలియాస్ వాసు ఇటీవ‌ల త‌ర‌చూ న్యూస్ మేక‌ర్ గా మారిపోయారు. ఆ

  • Written By:
  • Publish Date - August 10, 2022 / 09:00 PM IST

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి అలియాస్ వాసు ఇటీవ‌ల త‌ర‌చూ న్యూస్ మేక‌ర్ గా మారిపోయారు. ఆయ‌న విద్యుత్ శాఖ మంత్రిగా ప‌నిచేసిన రోజుల్లో ఏపీ వ్యాప్తంగా కోత‌లు ఉండేవి. అప్ప‌ట్లో ఆయ‌న మీద ప‌లు ర‌కాల సెటైర్ల‌తో సోషల్ మీడియా వేదిక నిండిపోయేది. ఆ త‌రువాత ఆయ‌న కారు హ‌వాలా చేస్తూ దొరికిపోయింద‌ని కొన్ని రోజుల్లో న్యూస్ హ‌ల్ చ‌ల్ చేసింది. సీన్ క‌ట్ చేస్తే, మంత్రి ప‌ద‌వి పోయింది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న్ను న్యూస్ మాత్రం వ‌ద‌ల‌డంలేదు. వారం క్రితం ఈడీ విచారించిన చిక్కోటి ప్ర‌వీణ్ కుమార్ కేసులోనూ ఆయ‌న ఉన్నార‌ని సోష‌ల్ మీడియా కోడైకూసింది.

ఆ న్యూస్ స‌ద్దుమ‌ణ‌గ‌క‌ముందే ఆయ‌న జ‌న‌సేనలోకి వెళుతున్నార‌ని ప్ర‌చారం ప్రారంభం అయింది. 2019 ఎన్నిక‌ల‌కు ముందు కూడా వాసు టీడీపీలోకి వెళుతున్నార‌ని పెద్ద ఎత్తున టాక్ న‌డిచింది. ముహూర్తం కూడా కొంద‌రు ఫిక్స్ చేశారు. కానీ, ఆయ‌న వైసీపీలోనే కొన‌సాగి మంత్రి అయ్యారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న పార్టీ మారుతున్నార‌ని టాక్ న‌డుస్తోంది. దానికి కార‌ణాలు లేక‌పోలేదు.

సీఎం జ‌గ‌న్ కుటుంబానికి బావ‌మ్మ‌ర్ది వైవీ సుబ్బారెడ్డి ద్వారా వాసు బంధువుగా అవుతారు. వైఎస్ కుటుంబంతో ఉన్న దూర‌పు బంధుత్వాన్ని రాజ‌కీయంగా బాగా వాడుకున్నారు. ఒకానొక స‌మ‌యంలో ఆర్థిక లావాదేవీల విష‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని కూడా మించిపోయేలా ప్ర‌వ‌ర్తించార‌ని పార్టీలోని వినికిడి. అందుకే, ఆయ‌న్ను మంత్రి ప‌ద‌వి నుంచి దూరంగా పెట్టార‌ని ప్ర‌చారం ఉంది. అంతేకాదు, అదే జిల్లా నుంచి మంత్రిగా ఉన్న సురేష్ ను కొన‌సాగిస్తూ వాసు గ్రాఫ్ ను త‌గ్గించారు. నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలోనూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని స్వేచ్ఛ‌గా నిర్ణ‌యాలు తీసుకోకుండా ప‌లు సంద‌ర్భాల్లో అడ్డుప‌డ్డార‌ట‌. అవ‌న్నీ దృష్టిలో పెట్టుకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉద్దేశ పూర్వ‌కంగానే మంత్రివ‌ర్గం నుంచి దూరంగా పెట్టార‌ని తాడేప‌ల్లి ప్యాలెస్ టాక్. అందుకే, ఆయ‌న పార్టీ మార‌బోతున్నార‌ని ప్ర‌చారం ఊపందుకుంది. కానీ, ఆయ‌న ఇత‌ర పార్టీల్లోకి వెళితే న‌ష్ట‌పోతార‌ని వైసీపీ భావిస్తోంది.

కొన్ని సంద‌ర్బాల్లో వ్యూహాత్మ‌కంగా ఇలాంటి ప్ర‌చారాన్ని తెర‌మీద‌కు తీసుకొస్తార‌ని ప్ర‌త్య‌ర్థులు చెప్పుకుంటారు. ఆయ‌న ప్రాధాన్యం పార్టీలో త‌గ్గిన‌ప్పుడ‌ల్లా వ్యూహాత్మ‌కంగా పార్టీ మారుతున్నార‌న్న ప్ర‌చారం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని స‌న్నిహితులు చెప్పుకుంటున్నారు. ఆ త‌రువాత ఆయ‌న ఖండించ‌డం, అధిష్టానం పిలిపించుకుని మాట్లాడ‌డం గ‌తంలోనూ చూశామంటూ స‌హ‌చ‌రులు భావిస్తున్నారు. అలాంటి స్పంద‌నే ఇప్పుడు బాలినేని నుంచి వ‌చ్చింది.
జ‌న‌సేన‌లోకి వెళుతున్నాన్న వార్తల్లో నిజం లేదని బాలినేని చెప్పారు. జనసేనలోకి వెళ్తున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెట్టారని, ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే ఉంటానని అన్నారు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా 22 నియోజకవర్గాల బాధ్యతలను జ‌గ‌న్ అప్పగించారని ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తే, తాను మద్దతు ప్రకటించానని వివ‌ర‌ణ ఇచ్చారు.