AP Assembly: అసెంబ్లీని కుదిపేసిన పెగాస‌స్..!

  • Written By:
  • Publish Date - March 21, 2022 / 12:40 PM IST

దేశంలోనే సంచ‌ల‌న రేపిన పెగాసస్ స్పైవేర్ అంశం ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కుదిపేసింది. వివాదాస్పద పెగసస్‌ స్పైవేర్‌ను నాలుగైదేళ్ల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీ బాంబు పేల్చిన సంగ‌తి తెలిసిందే. మ‌మ‌తా బెనర్జీ వ్యాఖ్య‌ల‌తో చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ త‌మ్ముళ్ళు ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డ‌గా, రాష్ట్ర రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున ప్ర‌కంప‌నులు రేపింది.

అయితే ఇప్పుడు పెగాసస్ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. ప్ర‌స్తుతం ఏపీలో అసెంబ్ల స‌మావేశాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో పెగాసస్ అంశంపై చర్చ జరపాలని వైసీపీ స‌భ్యులు పట్టుబట్టారు. మేరకు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి నోటీసు జారీ చేయ‌గా.. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చను చేపడతామని స్పీకర్ త‌మ్మినేని సీతారాం ప్రకటించారు. ఈ క్ర‌మంలో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాధ్ రెడ్డి మాట్లాడుతూ.. పెగాస‌స్ అంశంపై సుప్రీంకోర్టు సీరియ‌స్‌గా తీసుకుంద‌ని, దీంతో రాష్ట్రంలో టీడీపీ హ‌యాంలో జరిగిన ఈ అంశంపై చర్చ జరగాల్సిందేన‌ని బుగ్గ‌న కోరారు.

ఇక మ‌రోవైపు మంత్రి ఆదిమూల‌పు స‌రేష్ మాట్లాడుతూ.. పెగాసస్‌ కొనాలని తమ వద్దకు వచ్చినట్లు నాటి ఐటీ మంత్రి లోకేషే చెప్పారని, పెగాసస్‌పై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణకు కమిటీ వేసిందని, దీన్ని ఎవరు కొన్నారు ఎలా వినియోగించారు అనేది తేలాల్సి ఉందని మంత్రి సురేష్ అన్నారు. ఇక స‌భ‌లో ప్రశ్నోత్తరాల తర్వాత పెగాస‌స్ అంశంపై చర్చ జరుపుదామని స్పీకర్ త‌మ్మినేని ప్రకటించ‌గానే, పెగాస‌స్ అంశం పై చ‌ర్చ అసెంబ్లీ స‌భ‌లో చ‌ర్చ జ‌ర‌ప‌వ‌ద్దంటూ టీడీపీ స‌భ్యులు స్పీక‌ర్‌కు లేఖ రాశారు.

పెగాసస్‌ను ఏపీ కొనుగోలు చేయలేదని గతంలో మాజీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ చెప్పిన విషయాన్ని టీడీపీ సభ్యులు లేఖలో స్పష్టం చేశారు. అంతే కాకుండా ప్ర‌స్తుతం పెగాసస్ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని తెలిపిన టీడీపీ స‌భ్యులు, ఈ అంశం పై సభలో చర్చించాల్సిన అవసరం లేదని, అందుకు అనుమతి ఇవ్వవద్దని స్పీక‌ర్‌ను కోరారు. ఇక గతేడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా పెగాసస్ స్పైవేర్ అంశం చ‌ర్చ‌కు రావ‌డంతో, ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఇజ్రాయెల్‌కి చెందిన కంపెనీ నుంచి కొనుగోలు చేసిన ఈ స్పై వేర్‌తో దేశంలోని 300 మంది ప్రముఖులపై కేంద్ర ప్ర‌భుత్వం నిఘా పెట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే పెగాస‌స్ స్పై వేర్ అంశం ఏపీలోనూ ప్ర‌కంప‌నలు రేపుతోంది.