ఏపీలో వచ్చే జూన్ లో నాలుగు రాజ్యసభ స్థానాలూ ఖాళీ అవుతున్నాయి. వీటిలో నాలుగు స్థానాలూ వైసీపీకే దక్కుతాయి. అందుకే ఇందులో ఒక స్థానాన్ని సీఎం వైఎస్ జగన్ కు సన్నిహితంగా ఉండే ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీకి కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. మరో సీటును జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డికి ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవీకాలం కూడా జూన్ తొలివారంలోనే ముగుస్తుంది. దీంతో ఆయనను మరోసారి రాజ్యసభకు పంపిస్తారా లేదా అన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో ఉండేవి. ఎందుకంటే ఈమధ్య కాలంలో విజయసాయిరెడ్డికి జగన్ ప్రాధాన్యతను తగ్గించి సజ్జల రామకృష్ణారెడ్డికి ఇస్తున్నారు. విశాఖ బాధ్యతల నుంచి కూడా పక్కకు తప్పించారు. అయినా సరే.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈసారి ఆయనను కూడా రాజ్యసభకు పంపించే అవకాశముంది. నాలుగో సీటును మైనారిటీ లేదా దళిత వర్గానికి కేటయించే అవకాశముందంటున్నాయి పార్టీ వర్గాలు.
రాజ్యసభ అభ్యర్థుల జాబితాను త్వరలోనే ప్రకటించే అవకాశముంది. గత ఎన్నికల్లో అయితే రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి సన్నిహితంగా ఉండే పరిమళ్ నత్వానీకి వైసీపీ తరపున రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. అదే కోవలో ఇప్పుడు ప్రీతి అదానీకి కూడా పార్టీ సభ్యత్వం ఇస్తారని.. బీ-ఫారం అందిస్తారని.. తరువాత రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ప్రీతి అదానీకి వైసీపీ సభ్యత్వం ఇస్తే.. గౌతమ్ అదానీ కూడా వైసీపీ నాయకుడు అవుతారా? అన్న చర్చ జరుగుతోంది.
వైసీపీలో రాజ్యసభ సభ్యత్వాలను ఆశించేవారు ఎవరూ లేరా అంటే చాలా మంది ఉన్నారు. జగన్ కు ఇప్పుడు అత్యంత సన్నిహితుల్లో ముఖ్యుడైన సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్.. ఇంకా కొంతమంది నేతలు రేసులో ఉన్నారని తెలుస్తోంది. సీఎం జగన్ తన తాజా ఢిల్లీ పర్యటనలో ప్రధానితో భేటీ అవుతారు. అదే సమయంలో ఆయన రాజ్యసభ స్థానాలకు సంబంధించి చర్చలు జరుపుతారన్న పొలిటికల్ టాక్ నడుస్తోంది.