Konaseema : కోన‌సీమ ప్ర‌మాదం కుట్రా? స్టంటా?

కోన‌సీమ వ‌ద్ద చంద్ర‌బాబుకు జ‌రిగిన ప్ర‌మాదాన్ని వైసీపీ చుల‌క‌న‌గా చూస్తోంది. అదో స్టంట్ గా ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేయ‌డంతో టీడీపీ సీరియ‌స్ గా తీసుకుంది. అల‌పిరి సంఘ‌ట‌న త‌రువాత చంద్ర‌బాబు జ‌రిగిన రెండో ప్ర‌మాదంగా ఆ పార్టీ చెబుతోంది.

  • Written By:
  • Publish Date - July 23, 2022 / 09:00 AM IST

కోన‌సీమ వ‌ద్ద చంద్ర‌బాబుకు జ‌రిగిన ప్ర‌మాదాన్ని వైసీపీ చుల‌క‌న‌గా చూస్తోంది. అదో స్టంట్ గా ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేయ‌డంతో టీడీపీ సీరియ‌స్ గా తీసుకుంది. అల‌పిరి సంఘ‌ట‌న త‌రువాత చంద్ర‌బాబు జ‌రిగిన రెండో ప్ర‌మాదంగా ఆ పార్టీ చెబుతోంది. అంతేకాదు, ముంద‌స్తుగా ప్ర‌మాదాన్ని వైసీపీ ఫిక్స్ చేసింద‌ని మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్ ఆరోపణ‌ల‌కు దిగ‌డంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య రాజ‌కీయం వేడెక్కింది.

ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి ముందుగానే ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి దాని గురించి ట్వీట్ చేయ‌డాన్ని టీడీపీ అనుమానిస్తోంది. ఆ ట్వీట్ ఎప్పుడు చేశారు? ప్ర‌మాదం ఎప్పుడు జ‌రిగింది? ముందే ప్ర‌మాదాన్ని ఫిక్స్ చేస్తూ వైసీపీ ప్లాన్ చేసిందా? అంటూ జ‌వ‌హ‌ర్ ప్ర‌శ్నిస్తున్నారు. గ‌తంలోనూ కోడి క‌త్తి కేసులో ఇలాంటి సంవాదం ఆనాడు అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య రాద్ధాంతం జ‌రిగింది. సీన్ క‌ట్ చేస్తే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద కోడి క‌త్తితో హ‌త్యాయ‌త్నం చేసిన నిందితుడు శ్రీను ప్ర‌స్తుతం వైసీపీ సానుభూతిప‌రునిగా ఉన్నాడు. ఆ విష‌యాన్ని టీడీపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, వైఎస్ వివేకా గుండె పోటుతో మ‌ర‌ణించార‌ని తొలుత వైసీపీ లీడ‌ర్లు ఆనాడు చెప్పారు. తీరా, ఆయ‌న్ను హ‌త్య చేశార‌ని అంద‌రికీ తెలిసిందే. ఇలాంటి కుట్ర ఏదో గోదావ‌రి ప్ర‌మాదం వెనుక ఉంద‌ని అనుమానిస్తూ మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్ మీడియా ముందుకొచ్చారు.

కోన‌సీమ ప్ర‌మాదం వెనుక ఏదో కుట్ర జ‌రిగింద‌ని టీడీపీ అనుమానిస్తోంది. చంద్ర‌బాబును గోదావ‌రిలో ముంచ‌డానికి వైసీపీ ప్లాన్ చేసింద‌ని జ‌వ‌హ‌ర్ ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. అలిపిరి లాంటి సంఘ‌ట‌న‌ను కూడా ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌కు జోడిస్తున్నారు. అంటే, చంద్ర‌బాబుకు ప్రాణ‌హాని త‌ల‌పెట్ట‌డానికి కుట్ర జ‌రిగింద‌ని ఆయ‌న ఫిక్స్ అయ్యారు. ఆ మేర‌కు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ ను కోడ్ చేస్తున్నారు. ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌ముందే ఆయ‌న ట్వీట్ ఎలా చేస్తారంటూ నిల‌దీస్తున్నారు. ఆ ప్ర‌మాదంపై విచార‌ణ జ‌ర‌పాల‌ని కూడా డిమాండ్ చేయ‌డం రాజ‌కీయ ర‌చ్చ‌కు దారితీస్తోంది.

గోదావ‌రి వ‌ర‌ద బాధితుల కోసం వెళ్లిన చంద్ర‌బాబు వెంట మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రెండు ప‌డ‌వ‌ల్లో ప్ర‌యాణించ‌డానికి వెళ్లిన వాళ్ల‌కు లైఫ్ జాకెట్స్ ను జాల‌ర్ల అందించారు. వాటిని వేసుకున్న త‌రువాత ప‌డ‌వ‌ల్లో బ‌య‌లుదేరుతోన్న సంద‌ర్భంగా ప్ర‌మాదం సంభ‌వించింది. హ‌ఠాత్తుగా కొంద‌రు గోదావ‌రి నీళ్ల‌లో ప‌డిపోయారు. అప్ర‌మ‌త్త‌మైన జాల‌ర్లు సుర‌క్షితంగా వాళ్ల‌ను ఒడ్డుకు చేర్చారు. అందుకు సంబంధించిన వీడియోలో సోష‌ల్ మీడియా వేదిక‌గా వైర‌ల్ కావ‌డాన్ని చూశాం. కానీ, అదంతా స్టంట్ అంటూ వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో ఆ ప్ర‌మాదం జ‌రిగిన తీరుపై టీడీపీ అనుమానాల‌కు రేకెత్తిస్తోంది.

మొత్తం మీద గోదావ‌రి వ‌ర‌ద బాధితుల పరామ‌ర్శ కోసం వెళ్లిన చంద్ర‌బాబు ప్రాణం తీయ‌డానికి కుట్ర జ‌రిగింద‌ని టీడీపీ భావిస్తోంది. ఆ ప్ర‌మాదం స్టంట‌ని వైసీపీ, కుట్రంటూ టీడీపీ ర‌క్తిక‌ట్టించ‌డం రాజ‌కీయ హీట్ ను పెంచింది.