- పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్
- జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ పవన్
- తనపై అమ్ముడుపోయారనే నిందలు వేసినా ప్రజల కోసం తగ్గానని పవన్ ఆవేదన
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి పర్యటనలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్వహించే వారిని జైలుకు పంపుతామన్న జగన్ వ్యాఖ్యలకు పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. గత పదేళ్లుగా ఎన్నో అవమానాలు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని పార్టీని నడిపానని, తనపై అమ్ముడుపోయారనే నిందలు వేసినా ప్రజల కోసం తగ్గానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇంతటి ఘోర పరాజయాన్ని ఇచ్చినా వైకాపా నేతలకు బుద్ధి రాలేదని, ఇంకా రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని అదుపు చేసేందుకు తమకు రెండు రోజులు చాలని, అవసరమైతే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహా ట్రీట్‌మెంట్ ఇస్తామని హెచ్చరించారు.
రాజకీయాల్లో తన ప్రయాణం స్వార్థం కోసం కాదని, అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల స్ఫూర్తితో సాగుతోందని పవన్ పేర్కొన్నారు. అధికారం ఉన్నప్పుడే తనను ఏమీ చేయలేకపోయారని, ఇప్పుడు బెదిరిస్తే భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చినా తిరిగి వెళ్తానో లేదో తెలియని పరిస్థితుల్లోనే పోరాడుతున్నానని, అందుకే తనకు చావు భయం లేదని ఉద్వేగంగా మాట్లాడారు. ముఖ్యంగా పిఠాపురంలో చిన్న పిల్లలను అడ్డం పెట్టుకుని కుల రాజకీయాలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిదానికీ ఒక పరిమితి ఉంటుందని, హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవని వైకాపా నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
రాజకీయ విమర్శల పక్కన పెడితే, ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు రూ. 7,910 కోట్లతో చేపట్టిన ‘అమరజీవి జలధార’ పథకానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ బృహత్తర పథకం ద్వారా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు మరియు కోనసీమ జిల్లాల్లోని దాదాపు కోటిన్నర మంది ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని ఆయన వెల్లడించారు. అభివృద్ధి పనుల విషయంలో రాజీ పడేది లేదని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఈ సందర్భంగా పవన్ పునరుద్ఘాటించారు. కేవలం మాటలు చెప్పడం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల దాహార్తిని తీర్చడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.
