YCP Rowdyism : స‌ర్కార్ వారి రౌడీయిజం!

వైసీపీ గుండాయిజం ఒక్కొక్క‌టిగా వెలుగుచూడ‌డం ఆ పార్టీ అధిష్టానాన్ని క‌ల‌వ‌రప‌రుస్తోంది.

  • Written By:
  • Updated On - June 2, 2022 / 04:37 PM IST

వైసీపీ గుండాయిజం ఒక్కొక్క‌టిగా వెలుగుచూడ‌డం ఆ పార్టీ అధిష్టానాన్ని క‌ల‌వ‌రప‌రుస్తోంది. ఇటీవ‌ల డ్రైవ‌ర్ సుబ్ర‌మణ్యంను హ‌త్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు వ్య‌వ‌హారం మ‌రువ‌క ముందే ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రౌడీయిజం బ‌య‌ట‌ప‌డింది. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సూర్యకిరణ్ పై చేయిచేసుకోవ‌డం అధికారుల్లో క‌ల‌క‌లం రేగింది. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కొట్టారంటూ రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో సూర్యకిరణ్ ఫిర్యాదు చేయ‌డంతో ఇష్యూ వెలుగులోకి వ‌చ్చింది.

రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు పిలిపించి ఉన్నతాధికారుల సమక్షంలోనే చెంపపై మూడు సార్లు కొట్టారని ఫిర్యాదులో సూర్య‌కిర‌ణ్ పేర్కొన్నారు. సుమారు 20 మంది ఇరిగేషన్ ఇంజినీర్లు క‌లిసి సూర్య‌కిర‌ణ్ కు మ‌ద్ధ‌తుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ కు సంబంధించి సమాధానం చెపుతుండగానే ఎమ్మెల్యే దాడి చేశార‌ని వివ‌రించారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఇటీవ‌ల అనేకం వైసీపీ క్యాడ‌ర్‌, లీడ‌ర్ల రూపంలో చోసుచేసుకున్నాయి. కోన‌సీమ అల్ల‌ర్ల వెనుక వైసీపీ కార్పొరేట‌ర్ ఉన్నాడ‌ని ప్రాథ‌మికంగా తేలింది. మంత్రి విశ్వ‌రూప్ అనుచరుడు కోన‌సీమ అల్ల‌ర్ల‌కు కార‌ణంగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్ప‌టికీ ఆ ప్రాంతంలో శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులోకి రాక‌పోవ‌డానికి కార‌ణం అధికార‌ప‌క్షంకు సంబంధించిన వాళ్లు అల్ల‌ర్ల వెనుక ఉండ‌డమేన‌ని పలువురి అభిప్రాయం.

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడి ఇంటిపైకి ప్ర‌స్తుత మంత్రి జోగి ర‌మేష్ అండ్ బ్యాచ్ కొద్ది నెల‌ల క్రితం వెళ్లారు. టీడీపీ కార్యాల‌యాల్లోకి చొర‌బ‌డి విధ్వంసం సృష్టించారు. ఒంగోలులోని వైశ్య వ‌ర్గానికి చెందిన సుబ్బారావు ఇంటిలోకి వెళ్లి అత‌నిపై వైసీపీ నేత‌లు దాడి చేశారు. ప్రాణాపాయంతో ఇప్ప‌టికీ ఆయ‌న భ‌య‌ప‌డుతున్నారు. విజ‌య‌వాడ‌లోని సాధార‌ణ మ‌హిళ వెంకాయ‌మ్మ ఇంటిపైకి వెళ్లి వైసీపీ క్యాడ‌ర్ దాడి చేసింది. టీడీపీ లీడ‌ర్ ప‌ట్టాభి ఇంటికి వెళ్లి వైసీపీ క్యాడ‌ర్ దాడుల‌కు పాల్ప‌డింది.గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చందవరం గ్రామంలో సామాజిక కార్యకర్త యన్నం రమణారెడ్డిపై కొందరు వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. అధికారుల‌పై దాడులు, వాళ్ల‌ను బూతులు తిట్ట‌డం స‌ర్వ‌సాధారణంగా మారింది.

పోలీసుల‌ను అడ్డుపెట్టుకుని చేస్తోన్న అరాచ‌కాల విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు టీడీపీ బ‌య‌ట‌పెడుతోంది. ఇటీవ‌ల తిరుప‌తి వెళుతోన్న సాధార‌ణ కుటుంబానికి చెందిన కారును సీఎం కాన్వాయ్ కోసం అంటూ ఆర్టీఏ అధికారులు లాగేసుకున్నారు. విశాఖ‌లోని డాక్ట‌ర్ సుధాక‌ర్ మాస్క్ లు కావాల‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించినందుకు అత‌నిపై పోలీసుల‌తో దాడి చేయించారు. సొంత పార్టీ ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు వ‌ళ్లు హూనం చేసేలా దాడి చేశారు. ఆ విష‌యాన్ని ఆయ‌నే చెబుతున్నారు. ఇక ప్ర‌త్య‌ర్థి పార్టీల కార్య‌క‌ర్త‌ల‌ను హ‌త్య చేయ‌డం , నిర్బంధించ‌డం , దాడులు చేయ‌డం ష‌రామామూలుగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ స్థాయిల్లోని కొంద‌రు లీడ‌ర్ల దెబ్బ‌కు అధికారులు హ‌డ‌లిపోతున్నారు. వాళ్ల‌ను అదుపులో పెట్ట‌లేని ప‌రిస్థితుల్లో వైసీపీ అధిష్టానం ఉంద‌న్న అప‌వాదును ఎదుర్కొంటోంది. మొన్న‌టికి మొన్న డ్రైవ‌ర్ ను హ‌త్య చేసిన ఎమ్మెల్సీ అనంత‌బాబును స‌స్పెండ్ చేయ‌డానికి ఆ పార్టీ ఆచితూచి అడుగు వేసింది. ఇప్ప‌టికీ ఎమ్మెల్సీగా ఆయ‌న కొన‌సాగుతున్నారు. ఇక ఎమ్మెల్యే హోదాలో అధికారుల‌పై రౌడీయిజం చేస్తూ చేయిచేసుకున్న జ‌క్కంపూడి రాజా విష‌యంలోనూ వైసీపీ చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి నాన్చుడి ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తోంది.

ఇంజినీర్ పై \ వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దాడి చేసిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అధికార వైసీపీ పార్టీ నాయకుల ఉన్మాదం కట్టలు తెంచుకుంటోందని ట్వీట్ చేశారు. ప్రతిపక్షాలు, ప్రజలు అయిపోయార‌ని ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులపై వైసీపీ రౌడీలు పడ్డారని ఫైర్ అయ్యారు. అనుచరుల బిల్లులు చేయలేదని పోలవరం ఏఈ సూర్యకిరణ్ ను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దాడి చేయ‌డం దారుమ‌ణ‌ని ట్వీట్ చేశారు. వెంట‌నే జ‌క్కంపూడి మీద చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.