రాజమహేంద్రవరం పేపర్ మిల్లు కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా(Jakkampudi Raja)ను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు. పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కళ్యాణ మండపంలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్న సమయంలో, సుమారు 150 మంది పోలీసుల బృందం తెల్లవారుజామున 3 గంటలకు అక్కడకు చేరుకుని జక్కంపూడిని బలవంతంగా ఇంటికి తరలించి గృహ నిర్బంధంలో ఉంచారు.
జక్కంపూడి రాజా మంగళవారం ఉదయం 9 గంటలకు ఆమరణ దీక్ష ప్రారంభించబోతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో, దీక్షను అడ్డుకునేందుకు ముందస్తుగా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీక్షను భగ్నం చేయడంపై వైఎస్సార్ సీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. పేపర్ మిల్లు పరిసర ప్రాంతాల్లో నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు అక్రమంగా చర్యలు తీసుకున్నారని, ప్రజాస్వామ్య హక్కులను హరించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షలో పాల్గొనబోయే మిగిలిన 50 మందిని కూడా పోలీసులు ప్రివెంటివ్ అరెస్టు చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Kadapa Central Jail : కడప సెంట్రల్ జైలులో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. పేపర్ మిల్లు యాజమాన్యం కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాలుగా వేతన ఒప్పందం, ఇతర హక్కులు, సౌకర్యాల విషయంలో కార్మికులు అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. ఏడాది పాటు కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులను ఆశించి నిరీక్షించామని, అయితే ఎలాంటి పరిష్కార సూచనలు లేకపోవడంతో తాను దీక్షకు దిగేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పేపర్ మిల్లు ఎదుట వైఎస్సార్ విగ్రహం వద్దే దీక్ష ప్రారంభిస్తానని ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారని వివరించారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పేపర్ మిల్లులో 27 శాతం వాటా ఉందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వాటాను విక్రయించారని జక్కంపూడి రాజా విమర్శించారు. అప్పటివరకు మిల్లుపై ప్రభుత్వ నియంత్రణ ఉండడంతో కార్మికులకు హక్కులు సమర్థవంతంగా లభించేవని తెలిపారు. వాటా విక్రయానికి తర్వాత కార్మికుల సమస్యలు తీవ్రమయ్యాయని చెప్పారు. వేతన ఒప్పందంలో గత 30 ఏళ్లలో ఇంత జాప్యం జరగలేదని అన్నారు. కార్మిక సంఘాల అభ్యర్థన మేరకు గతంలో రెండు మార్లు దీక్షను వాయిదా వేసుకున్న విషయాన్ని కూడా గుర్తుచేశారు.
Salman Bhutt : ప్రపంచ కప్, ఒలింపిక్స్‌లో కూడా పాక్‌తో ఆడమని హామీ ఇవ్వాలి