AP Politics : అదిరింద‌య్యా జ‌గ‌న్‌!

మైండ్ గేమ్ ఆడ‌డంలో వైసీపీ ఆరితేరి పోయింది. ప్ర‌త్య‌ర్థి పార్టీల్లో గిలిగింత‌లు పెట్టించ‌డంలో దిట్ట‌గా మారిపోయింది.

  • Written By:
  • Publish Date - June 20, 2022 / 03:00 PM IST

మైండ్ గేమ్ ఆడ‌డంలో వైసీపీ ఆరితేరి పోయింది. ప్ర‌త్య‌ర్థి పార్టీల్లో గిలిగింత‌లు పెట్టించ‌డంలో దిట్ట‌గా మారిపోయింది. విప‌క్షాల మ‌ధ్య ఐక్య‌త లేకుండా చేయ‌డంలో స‌క్సెస్ అవుతోంది. ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీ గ్రాఫ్ పెరిగిన విష‌యాన్ని గ్ర‌హించిన వైసీపీ స‌రికొత్త మైండ్ గేమ్ ఆడుతోంది. విప‌క్షాల మ‌ధ్య ఐక్య‌త‌లేకుండా రాజ‌కీయ దాడిని ఎప్ప‌టిక‌ప్పుడు చేస్తోంది. రైతు భ‌రోసా స‌భ‌లో పొత్తుల‌పై ప‌వ‌న్ కామెంట్ చేసిన మ‌రుక్ష‌ణ‌మే మాజీ మంత్రి పేర్ని నాని మీడియా ముందుకొచ్చారు. ప్ర‌జ‌ల‌తో పొత్తు అంటూ చెప్పిన జ‌న‌సేనాని, అదే మాట మీద ఉండాల‌ని నిల‌దీశారు. చివ‌రి నిమిషంలోనైనా టీడీపీతో పొత్తుకు ప‌వ‌న్ వెళ‌తార‌ని జోస్యం చెప్పారు.

రెండు వైపులా ప‌దును ఉండేలా పొత్తుల‌పై వైసీపీ మైండ్ గేమ్ ను ప్రారంభించింది. విప‌క్షాల మ‌ధ్య ఐక్య‌త ఉంటే ప్ర‌భుత్వానికి స‌హ‌జంగా ఎంతో కొంత న‌ష్టం. ప్ర‌త్య‌ర్థులు అంద‌రూ ఏకమైతే ప్ర‌భుత్వాన్ని న‌డుపుతోన్న వైసీపీకి ఓటు బ్యాంకు ప‌రంగా ప్ర‌భావం ఉంటుంది. అందుకే, జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్య పొత్తు గురించి చిల‌వ‌లు ప‌లువలుగా వైసీపీ చెబుతోంది. ఒక వేళ ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే సీఎం అభ్య‌ర్థి ఎవ‌రు? అంటూ లాజిక్ తీసింది. చంద్ర‌బాబును సీఎం అభ్య‌ర్థిగా అంగీక‌రిస్తే, ప‌వ‌న్ అమ్ముడుపోయిన‌ట్టేన‌ని ప‌దునైనా రాజ‌కీయ క‌త్తిని తీసింది. దీంతో ఎటూ తేల్చుకోలేని ప‌రిస్థితికి జ‌న‌సేనాని వెళ్లారు.

వైసీపీ మైండ్ గేమ్ లో ప‌డిన జ‌న సైనికులు సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్ ను ప్ర‌క‌టించాల‌ని టీడీపీ మీద సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒత్తిడి పెంచింది. అంతేకాదు, 50-50 ఫార్ములాను కొంద‌రు బ‌య‌ట‌కు తీశారు. తొలి రెండున్న సంవత్స‌రాలు ప‌వ‌న్ మ‌రో రెండున్న సంవ‌త్స‌రాలు చంద్ర‌బాబు సీఎం అంటూ మ‌రికొంద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌న‌సైనికులు ఇష్టానుసారంగా పోస్ట్ లు పెట్టారు. ఈ మొత్తం గంద‌ర‌గోళానికి టీడీపీ దూరంగా ఉన్న‌ప్ప‌టికీ ఏదో ఒక ర‌కంగా జ‌న‌సేన‌, టీడీపీ ల‌ను పొత్తుల‌ సీన్లోకి వైసీపీ లాగింది. ద‌త్త‌పుత్రుడు ప‌వ‌న్ అంటూ విస్తృతంగా వైసీపీ నేత‌లు ప్రచారం చేశారు. అది ప‌వ‌న్ కు బాగా త‌గిలింది. ప్ర‌తి వేదిక‌పైనా ద‌త్త‌పుత్రుడు అంటూ ప్ర‌చారం చేస్తున్నార‌ని ప‌వ‌న్ నొచ్చుకున్నారు. వైసీపీకి కావాల్సింది కూడా అదే. ఇలా, జ‌న‌సేన పార్టీని వైసీపీ ఇర‌కాటంలో పెట్టింది.

ఒక వేళ 2014 ఈక్వేష‌న్ ప్ర‌కారం వెళితే, 10 నుంచి 15 సీట్ల వ‌ర‌కు జ‌న‌సేన‌కు ఇద్దామ‌ని టీడీపీ భావించింద‌ట‌. కానీ, వైసీపీ మైండ్ గేమ్ తో జనసేన రాజ్యాధికారం దిశ‌గా ఆలోచిస్తోంది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా పొత్తు అనే అంశాన్ని ప‌క్క‌న పెట్టేసింది. దీంతో వైసీపీ విసిరిన మైండ్ గేమ్ పారిన‌ట్టు అయింది. ఒక వేళ త్యాగానికి సిద్ద‌ప‌డి జ‌న‌సేన‌, టీడీపీ ఒక‌టైన‌ప్ప‌టికీ ఏ మాత్రం న‌ష్టం లేకుండా వైసీపీ మాస్ట‌ర్ స్కెచ్ వేసింది. సింహం సింగిల్ అంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బలాన్ని ప్రొజెక్ట్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. అంతేకాదు, ఒంట‌రిని చేసి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఓడించాల‌ని చూస్తున్నార‌ని ప్ర‌చారం సాగిస్తోంది. సానుభూతి కోణం నుంచి జ‌గ‌న్ బ‌లాన్ని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. ఇలా రెండు వైపులా ప‌దునుండేలా మైండ్ గేమ్ ను వైసీపీ ఆడుతోంది.

2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌త్యేక హోదా అస్త్రాన్ని ప్ర‌యోగించ‌డం ద్వారా టీడీపీని బోల్తా కొట్టించింది. ఆనాడు టీడీపీ ఎంపీలు రాజీనామా చేసే వ‌ర‌కు ప్ర‌తి సంద్భంలోనూ ప్ర‌త్యేక హోదా అస్త్రాన్ని వైసీపీ సంధించింది. పార్ల‌మెంట్ లోప‌ల‌, బ‌య‌ట హోదా అస్త్రాన్ని ప్ర‌యోగించ‌డం ద్వారా టీడీపీపైన‌ మైండ్ గేమ్ ఆడింది. ఆ క్ర‌మంలో ఎన్డిఎ నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదే స‌మ‌యంలో అమ‌రావ‌తి అంశంపై టీడీపీ, జ‌న‌సేన మధ్య వైసీపీ పొగ బెట్టింది. దీంతో బీజేపీ, జ‌న‌సేన పార్టీల‌ను టీడీపీ వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. ఒంట‌రిగా 2019 ఎన్నిక‌ల్లో దిగిన టీడీపీ, జ‌న‌సేన కూట‌మి, వైసీపీ మ‌ధ్య జ‌రిగిన పోటీలో 151 మంది ఎమ్మెల్యేల‌తో జ‌గ‌న్మోహ‌నరెడ్డి సీఎం అయ్యారు. ప్ర‌జా బ‌లంతో పాటు ప్ర‌త్య‌ర్థులపై ఆడిన మైండ్ గేమ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని తిరుగులేని నాయ‌కునిగా చేసింది. ఇప్పుడూ అదే పంథాను ఎంచుకున్న వైసీపీ రెండు వైపులా ప‌దునుండే మైండ్ గేమ్ ను ఆడుతుంద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు భావిస్తున్నాయి. కానీ, ఎవ‌రి అనుకూల కోణం వాళ్ల‌దే అన్న‌ట్టు ఏపీ రాజ‌కీయ పార్టీల పొత్తు వ్య‌వ‌హారం ఉంది.