Minister Narayana : ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వం మున్సిపల్ శాఖ నిధులను అవినీతికి గురిచేసిందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం నెల్లూరు నగరంలోని 45వ డివిజన్‌లో కాలువ పూడికతీత పనుల పరిశీలన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
“గత వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ శాఖకు చెందిన రూ.3,000 కోట్ల నిధులను ఇతర ప్రయోజనాల కోసం మళ్లించింది. అంతే కాదు, ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర పరిస్థితి మళ్లీ పునరుద్ధరణ దశలో ఉంది,” అని నారాయణ వ్యాఖ్యానించారు.
నెల్లూరులోని 6.7 కిలోమీటర్ల కాలువల్లో పూడికతీత పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. పారిశుద్ధ్యం, మౌలిక వసతుల్లో ఎటువంటి రాజీ లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చడం, ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు.
పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాల విద్యను అందించేందుకు నెల్లూరులో వీఆర్ హైస్కూల్ తరగతులు సోమవారం నుంచే ప్రారంభమయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. ఆగిపోయిన అభివృద్ధి పనులన్నింటినీ వేగవంతం చేస్తూ, రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.