#3YearsForYSRCPMassVictory : విజ‌యోత్స‌వానికి మూడేళ్లు!

మూడేళ్ల క్రితం స‌రిగ్గా ఇదే రోజున వైసీపీ ఫ్యాన్ గాలి వీచిన రోజు. ఆ పార్టీకి, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి మ‌ర‌పురాని మే 23వ తేదీ.

  • Written By:
  • Publish Date - May 23, 2022 / 03:04 PM IST

మూడేళ్ల క్రితం స‌రిగ్గా ఇదే రోజున వైసీపీ ఫ్యాన్ గాలి వీచిన రోజు. ఆ పార్టీకి, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి మ‌ర‌పురాని మే 23వ తేదీ. అనూహ్యంగా 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల‌ను గెలుచుకున్న మ‌ధుర‌క్ష‌ణాల‌వి. 2019 మే 23న ఓట్ల లెక్కింపు జ‌రిగింది. తొలి రౌండ్ నుంచే ఫ్యాన్ గాలి వీచింది. మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు దాదాపుగా అన్ని స్థానాల్లోనూ ఏ పార్టీ ఎక్క‌డ అనేది స్ప‌ష్టం అయింది. వైసీపీ క్యాడ‌ర్ పెద్ద ఎత్తున సంబ‌రాలు జ‌రుపుకున్న క్ష‌ణాల‌వి. సుదీర్ఘ పాద‌యాత్ర ఇచ్చిన ఫ‌లితాల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆస్వాదించిన రోజు ఇది.

2014 నుంచి ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీ రికార్డు విక్ట‌రీ ని అందుకుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల‌కు గాను ఏకంగా 151 సీట్ల‌ను వైసీపీ కైవ‌సం చేసుకుంది. రాష్ట్రంలో 25 లోక్ స‌భ స్థానాలుంటే వైసీపీ 22 సీట్ల‌ను గెలుచుకుంది. రికార్డు మెజారిటీతో వైసీపీ అధికార పార్టీగా కొత్త అవ‌తారం ఎత్తింది. మూడేళ్ల క్రితం నాటి మధుర‌క్ష‌ణాల‌ను గుర్తు చేసుకుంటూ వైసీపీ సోమ‌వారం సంబ‌రాలు చేసుకుంది.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు సుదీర్ఘంగా సాగిన సంగ‌తి తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా లోక్ స‌భ ఎన్నిక‌లు, ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లను ఈసీ విడ‌త‌ల‌వారీగా నిర్వ‌హించింది. ఆ క్ర‌మంలో చివ‌రి ద‌శ కంటే చాలా ముందుగానే పోలింగ్ ముగిసిన ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపున‌కు చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. ద‌శ‌ల వారీగా ఎన్నిక‌లు పూర్తి అయ్యాక గానీ ఓట్ల లెక్కింపు జ‌రిగింది. ఏపీ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యేందుకు పోలింగ్ ముగింపుకు మ‌ధ్య దాదాపు నెల రోజుల గ్యాప్ ఉంది. ఆ స‌మ‌యం బెట్టింగ్ ల‌కు దారితీసింది. టీడీపీ, వైసీపీ క్యాడ‌ర్ మ‌ధ్య ఉత్కంఠ‌త‌ను పెంచింది. కానీ, ఫ‌లితాల వ‌చ్చేసరికి టీడీపీ ఢీలా ప‌డింది.

ప్ర‌ధాన పార్టీలుగా వైసీపీ, టీడీపీ ఉన్న‌ప్ప‌టికీ జ‌న‌సేన కూట‌మి కూడా 2019 ఎన్నిక‌ల్లో నిల‌బ‌డింది. బీఎస్పీ, క‌మ్యూనిస్ట్ ల‌తో క‌లిసి ప‌వ‌న్ కూటమి క‌ట్టారు. ఆయ‌న భీమవ‌రం, గాజువాక నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేశారు. భీమవ‌రం లోక్ స‌భ స్థానానికి నాగ‌బాబు పోటీ చేశారు. ఇద్దరూ ఘోరంగా ఓడిపోవ‌డమే కాదు, కూటమి పోటీ చేసిన స్థానాల్లో డిపాజిట్ల చాలా చోట్ల రాలేదు. మొత్తంగా 51శాతం ఓటు బ్యాంకుతో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాల‌ను 22 ఎంపీల‌ను గెలుచుకుంది. టీడీపీ 39.4శాతం ఓటు బ్యాంకుతో కేవ‌లం 23 ఎమ్మెల్యేలు, 3ఎంపీల‌కు పరిమితం అయింది. ఇక జ‌న‌సేన కూట‌మి అడ్ర‌స్ కూడా లేకుండా పోయింది. కేవ‌లం 4.6శాతం ఓటు బ్యాంకుతో కూట‌మి ప్ర‌జ‌ల ముందు చిన్న‌బోయింది.

అప్ర‌తిహ‌త విజ‌యాన్ని అందుకున్న వైసీపీ ఊరువాడ సంబ‌రాల‌ను జ‌రుపుకుంది. ఆనందోత్సాహం న‌డుమ కేకుల‌ను కట్ చేసి వేడుక‌ల‌ను చేసుకుంది. వైఎస్ కుటుంబం ప‌డిన క‌ష్టానికి ఫలితం ద‌క్కింద‌ని అభిమానులు సంబ‌ర ప‌డ్డారు. సీన్ కట్ చేస్తే, ఆ త‌ర‌హా సంబ‌రాలకు భిన్నంగా సాదాసీదాగా వైసీపీ మూడేళ్ల విజ‌యోత్స‌వాన్ని జ‌రుపుకోవ‌డం గ‌మ‌నార్హం. మూడేళ్ల త‌రువాత ఆనాటి విజ‌యోత్స‌వాన్ని ట్వీట్ల రూపంలోనే ఎక్కువ‌గా జ‌రుపుకోవ‌డం విశేషం.