Site icon HashtagU Telugu

YSRCP 12 Years : జ‌గ‌న్ ‘పుష్క‌ర’ చ‌క్రం

Jagan Ysrcp

Jagan Ysrcp

పుష్కర వసంతంలోకి వైసీపీ అడుగుపెట్టింది. నెహ్రూ కుటుంబం నుంచి ఎదురైన ప‌రాభ‌వం నుంచి జగన్, విజయమ్మ రూపంలో యువ‌జ‌న శ్రామిక‌ రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భ‌వించింది. ప‌న్నెడేళ్ల ప్ర‌యాణంలో ఎన్నో ఆటుపోట్ల‌ను త‌ట్టుకుని కోట్లాది హృదయాల్లో సుస్ధిర స్థానం సంపాదించుకుంది. రాష్ట్ర‌ వ్యాప్తంగా పార్టీ 12వ ఆవిర్భావ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని సీఎం జ‌గ‌న్ పిలుపునిచ్చాడు. ఆ మేర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా వైఎస్ అభిమానులు, వైసీపీ క్యాడ‌ర్ వేడుక‌ల‌ను జ‌రుపుకుంటోంది.తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోని అడుగుపెట్టిన జ‌గ‌న్ ఇంతింతై వటుడింతై రాజకీయాలకే రాజకీయం నేర్పిన నేతగా అవతరించాడు. ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనాలకు జ‌గ‌న్ కేంద్రబిందువుగా మారాడు. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో తండ్రి వైఎస్ అకాల మరణం తరువాత జ‌గ‌న్ ప‌డిన మాన‌సిక వ్య‌ధ వ‌ర్ణ‌నాతీతం. ఏనాడూ కుంగిపోకుండా గుండెనిండా మ‌నోధైర్యాన్ని నింపుకుని ముందుకు క‌దిలిన జ‌న్మోహ‌నుడు ఆయ‌న‌. తండ్రికి వార‌సునిగా సీఎం సీటును ఆశించి కాంగ్రెస్ అధినాయకత్వం చేతిలో భంగపడ్డాడు. జాతీయ స్థాయిలో ఫుల్ స్వింగ్ లో ఉన్న సోనియాకే ఎదురొడ్డి నిలిచాడు. సుమారు ఎనిమిదిన్నరేళ్ళ పాటు ప్రజలకు చేరువయ్యేందుకు తీవ్రంగా శ్రమించాడు. జైలు జీవితం అనుభవించాడు. పాద యాత్రలు చేశాడు. ప్ర‌త్య‌ర్థుల కుళ్లు కుతంత్రాల‌ను చిరున‌వ్వుతో ఎదుర్కొన్నాడు. సీన్ క‌ట్ చేస్తే 2019లో ఊహకందని ఫలితాన్ని ముద్దాడాడు. యువ‌జ‌న శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఇవాళ్లితో 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ ఏట అడుగు పెట్టింది. పార్టీకి పేరు పెట్టినప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తండ్రి పేరు స్ఫురించేలా యువజన శ్రామిక రైతు.. అంటే ఇంగ్లీష్ లో వైఎస్ఆర్ వచ్చేలా దానికి కాంగ్రెస్ అని చేర్చి.. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని 2011వ ఏడాది మార్చి 12వ తేదీన ప్రారంభించాడు.

2009 సెప్టెంబర్ 2వ తేదీన ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలిపోవడంతో దుర్మరణం చెందాడు. ఆ స‌మ‌యంలో వైఎస్ జగన్ కడప ఎంపీగా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తండ్రి మరణం తరువాత 2009 డిసెంబర్‌లో పులివెందుల శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. స్వ‌ర్గీయ వైఎస్‌ సతీమణి వైఎస్ విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నుకోవ‌డం ద్వారా అసెంబ్లీలోకి అడుగు పెట్టింది. కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేత, ఆనాటి ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఆ విధంగా చేయ‌డం జ‌గ‌న్ కు న‌చ్చ‌లేదు. తండ్రి స్థానంలో తాను సీఎం కావడానికి అన్ని అర్హతలున్నాయని బలంగా భావించిన వైఎస్ జగన్.. కాంగ్రెస్ పార్టీలో వుంటూనే సీఎం అయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం వైఎస్ ఆర్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డికి అధిక ప్రాధాన్యతనిస్తూ.. జగన్‌ను తొక్కేయాల‌ని పావులు క‌దిపింది. చిన్నాన్న వివేకానందరెడ్డికి మంత్రి పదవినిచ్చి వైఎస్ఆర్ కుటుంబానికి పెద్దపీట వేస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ఫోక‌స్ ఇచ్చింది. ఫ‌లితంగా వివేకానందతో జగన్‌కు ఓ దశలో దూరం పెరిగింది. ఆనాడు సీఎం వై.ఎస్.ఆర్ మృతిని తట్టుకోలేని అభిమానులు కొంద‌రు గుండెపోటుతో మ‌ర‌ణించారు. మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర ను జ‌గ‌న్ చేప‌ట్టాడు. అనూహ్య స్పంద‌న ఆ యాత్రకు రావ‌డంతో కాంగ్రెస్ అధిష్టానం అడ్డుకుంది. మౌనంగా ఉండిపోయిన జ‌గ‌న్ తనకో, తన తల్లి విజయమ్మకో పార్టీ ప్రాధాన్యతిస్తుందనుకుని ఏడాదిపాటు కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగాడు. కాంగ్రెస్ అధిష్టానంపై అస‌హ‌నంతో వైఎస్ జగన్ చివరికి 2010 నవంబర్ 29న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవులను కూడా వదులుకున్నాడు. అదే ఏడాది డిసెంబర్ 7 తాను కొత్త పార్టీ పెట్టబోతున్నానని సంకేతాలు ఇచ్చాడు. 45 రోజుల్లో పార్టీని ఏర్పాటు చేస్తానని ప్ర‌క‌టించాడు. తన పార్టీ పేరును, ఇతర వివరాలను తూర్పు గోదావరి జిల్లా జగ్గన్నపేటలో వెల్ల‌డించాడు.

2011 మార్చి 12వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్ప‌డింది. ఆనాటి నుంచి పార్టీకి జ‌గ‌న్‌ అధ్యక్షునిగాను, ఆయ‌న‌ తల్లి విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగాను ఉన్నారు. పార్టీ పెట్టిన తర్వాత కడప లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిపై 5 లక్షల 43 వేల ఓట్ల ఆధిక్యంతో జ‌గ‌న్ రికార్డు విజ‌యం సాధించాడు. అదే ఊపుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓదార్పు యాత్రను కొన‌సాగించాడు. 2014 ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న తరుణంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విడ‌తీసింది. కానీ, సమైక్య వాద ఉద్య‌మాల‌ను జ‌గ‌న్ చేశాడు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు జగన్. తాను స్వయంగా ఆమరణ దీక్షకు కూర్చొన్నాడు. పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చేసిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోనూ రాజీనామాలు చేయించాడు. 2012లో 19 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు రాగా.. వైసీపీ 17 సీట్లలో ఘన విజయం సాధించింది. రెండు పార్లమెంటరీ స్థానాలను కూడా గెలుచుకుంది. ఆ విజ‌యాల‌ను చూసిన కాంగ్రెస్ అధిష్టానం ఆయ‌న్ను తొక్కేయాల‌ని ప్లాన్ చేసింది. తండ్రి సీఎంగా వున్నప్పుడు అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న అభియోగం మీద ఆయనపై సీబీఐ, ఈడీ కేసులు మోపింది. 2012 మే 27న జగన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. 16 నెలల పాటు హైదరాబాద్ చంచల్ గూడ జైలులోనే జగన్ వున్నాడు. 2013 సెప్టెంబర్ 2న జగన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది.

 

ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో వైసీపీ 44.47 శాతం ఓట్లు సంపాదించినా.. కావాల్సిన మేజిక్ ఫిగర్ అందుకోలేకపోయింది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలుండగా.. వైసీపీ 67 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. 9 ఎంపీ సీట్లను సాధించింది. 2014 ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీని బలోపేతం చేసేందుకు జగన్‌ తగిన వ్యూహాల అమలు చేయడం ప్రారంభించాడు. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో 14 నెలల పాటు ఏపీలో పాదయాత్ర చేశారు. నవంబర్ 6, 2017న ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర.. జనవరి 9, 2019న ముగిసింది. ఇప్పటి వరకు ఎవరూ చేయని రీతిలో 3 వేల కిలోమీటర్లు దూరం జగన్ పాదయాత్ర చేశాడు.ఆ పాద యాత్ర జగన్ ను జనాలకు మరింత చేరువ చేసింది. దీంతో 2019 ఎన్నికలలో అంచనాలకు అందకుండా 151 ఎమ్మెల్యే స్థానాలు, 22 ఎంపీ స్ధానాలలో తన పార్టీ అభ్యర్థులను గెలిపించగలిగాడు. ఏపీలో మొత్తం పోలయిన ఓట్లలో 50 శాతం సాధించింది. మే 30, 2019న ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం ఏపీలో తిరుగులేని పార్టీగా వైసీపీ ఎదిగింది. ఈ క్రమంలోనే భారీ ఎత్తున పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చేసుకుంటోంది. ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నేత‌లు ఏపీ వ్యాప్తంగా జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ స్పందిస్తూ… ”దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయిస‌స అంటూ ఆయ‌న ట్వీట్ చేశాడు.

Exit mobile version